విదేశీ ఉద్యోగం.. ఇక ప్రభుత్వ మార్గంలోనే..!
– ప్రైవేటు ఏజెంట్లను నమ్మొద్దు.. టామ్‌కామ్ ద్వారా అవకాశాలు: జిల్లా ఉపాధి కల్పన అధికారి యం. రాధిక
– ప్రభుత్వ పర్యవేక్షణలోనే నియామకాలు.. వివిధ దేశాల్లో ఉద్యోగావకాశాలు
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (సెప్టెంబర్, 26):
విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే జిల్లా యువతకు తెలంగాణ ప్రభుత్వం సువర్ణ అవకాశం కల్పిస్తోందని జిల్లా ఉపాధి కల్పన అధికారి యం. రాధిక తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ టామ్‌కామ్ (తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ), జిల్లా ఉపాధి కార్యాలయం పర్యవేక్షణలో ఈ-మైగ్రేట్ విధానం ద్వారా జర్మనీ, ఇజ్రాయెల్, ఆస్ట్రియా, ఐర్లాండ్, సౌదీ, ఖతార్, దుబాయ్, అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా, ఒమన్ తదితర దేశాల్లో విదేశీ ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
*జర్మనీ, ఇజ్రాయెల్, యూరప్ దేశాల్లో నర్సింగ్ అవకాశాలు:
జర్మనీలో బీఎస్సీ నర్సింగ్, జీఎన్‌ఎం పూర్తి చేసిన నర్సులకు నెలకు 2,800 యూరోలు వరకు వేతనం లభించే అవకాశం ఉందని తెలిపారు. అలాగే ఇతర ఆరోగ్య రంగానికి సంబంధించి శిక్షణతో కూడిన ఉద్యోగాలకు 2,800 నుంచి 3,000 యూరోల వరకు వేతనాలు ఉంటాయని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ అర్హతతో 18–28 ఏళ్ల వయస్సు ఉన్నవారు వీటికి అర్హులన్నారు. ఇజ్రాయెల్‌లో గృహ సంరక్షణ ఉద్యోగాలకు (ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్ అర్హత) నెలకు రూ.1.99 లక్షలకు పైగా వేతనం లభిస్తుందని తెలిపారు. ఆస్ట్రియా, ఐర్లాండ్, సౌదీ, ఖతార్ దేశాల్లో నమోదిత నర్సులకు రూ.1.21 లక్షల నుంచి రూ.3.40 లక్షల వరకు వేతన అవకాశాలు ఉన్నాయని, రెండేళ్ల అనుభవం తప్పనిసరి అని పేర్కొన్నారు.
*దుబాయ్, అమెరికా, ఆస్ట్రేలియాలో వివిధ ఉద్యోగాలు:
దుబాయ్‌లో ట్యాక్సీ డ్రైవర్లు, ఈవీ బైక్ రైడర్లు, మేసన్లు, కార్పెంటర్లు, సహాయకుల ఉద్యోగాలకు నెలకు 1,200 నుంచి 6,000 దిర్హామ్‌ల వరకు వేతనం ఉంటుందన్నారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్ అర్హతతో పాటు అనుభవం ఉన్నవారు అర్హులని తెలిపారు. అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా, ఒమన్ దేశాల్లో స్టాఫ్ నర్స్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, వ్యవసాయ కార్మికుల ఉద్యోగాలు ఉన్నాయని, కొన్ని ఉద్యోగాలకు ఏడాదికి 70 వేల నుంచి 95 వేల డాలర్ల వరకు వేతన అవకాశాలు ఉన్నాయని వివరించారు.
*దరఖాస్తు విధానం & సంప్రదించాల్సిన నంబర్లు:
పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, నర్సింగ్ పూర్తి చేసి అనుభవం ఉన్నవారు బయోడేటా, విద్యార్హత పత్రాలు, పాస్‌పోర్టులతో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ప్రకటనలోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నమోదు చేసుకోవచ్చని, వివరాలకు 7842617596, 9866465024 నంబర్లలో లేదా *emp.medchal@gmail.com* ఈ-మెయిల్ ద్వారా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. విదేశీ ఉద్యోగాల పేరుతో ప్రైవేటు ఏజెంట్లకు రూపాయి కూడా చెల్లించవద్దని, అధికారిక మార్గాల ద్వారానే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని రాధిక కోరారు.రిపోర్టర్ పన్నాల బాల్ రెడ్డి