telanagana
ఉద్యోగం చేస్తూనే ఉన్నత విద్యలో మెరిసిన ప్రశాంత్ - బిఆర్ఎవోయు స్నాతకోత్సవంలో బంగారు పతకం
సూర్య, మందమర్రి:ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఉన్నత విద్యను కొనసాగించి బంగారు పతకం సాధించి మందమర్రి యువకుడు మద్దెల ప్రశాంత్ ప్రతిభ చాటారు. డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవంలో బీఎల్‌ఐఎస్సీ కోర్సులో అత్యధిక మార్కులు సాధించినందుకు ఆయనకు బంగారు పతకం లభించింది. హైదరాబాద్‌లోని విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని భవనం వెంకట్రామ్ ఆడిటోరియంలో బుధవారం జరిగిన స్నాతకోత్సవంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ప్రశాంత్ పతకాన్ని అందుకున్నారు. మందమర్రి విద్యానగర్‌లోని రాజన్నలవాడకు చెందిన ప్రశాంత్ అన్ని సబ్జెక్టులను ఒకేసారి పూర్తి చేసి ప్రథమ శ్రేణిలో అత్యధిక మార్కులు సాధించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ శాఖలో గెజిటెడ్ అధికారి హోదాలో ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రశాంత్.. ఉద్యోగంతో పాటు చదువుపైనా దృష్టి సారించి ఈ ఘనత సాధించడం విశేషం. ఆయన తండ్రి కీర్తిశేషులు నాగయ్య యాదవ్ సింగరేణిలో కోల్ ఫిల్లర్‌గా పనిచేశారు. తండ్రి మరణానంతరం తల్లి విజయలక్ష్మి కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుని చిన్న దుకాణం నిర్వహిస్తూ పిల్లలను చదివించారు. తల్లి ప్రోత్సాహంతో విద్యలో ముందుకు సాగిన ప్రశాంత్.. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగి, ఉద్యోగంతో పాటు చదువులోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఆయన సాధించిన బంగారు పతకం కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల్లో ఆనందం నింపింది. పట్టుదల, కష్టపడి చదివితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని ప్రశాంత్ నిరూపించారని వారు పేర్కొన్నారు.