తెలంగాణ టూరిజానికి ఐటీ చేయూత
ఫ్యూచర్ సిటీకి పెట్టుబడుల ఆహ్వానం
3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పారిశ్రామికీకరణ, పర్యాటకం, ఇంధన రంగాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టంగా పేర్కొన్నారు. శుక్రవారం నాడు ప్రజాభవన్‌లో ఎకో టూరిజాన్ని ప్రోత్సహించడంలో భాగంగా మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో పలు ఐటీ సంస్థల సీఈఓల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు వారాంతపు పర్యాటక అవకాశాలను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో వివిధ శాఖల మధ్య సమన్వయం పెంచేందుకు సమావేశం నిర్వహించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఐటీ, పర్యాటక, నీటిపారుదల, అటవీ శాఖల అధికారులు, మంత్రులు, సాఫ్ట్‌వేర్ కంపెనీల సీఈవోలతో కలిసి పర్యాటక అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలనే ఆలోచనతో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు వివరించారు.
రాష్ట్రంలో ప్రణహిత–చేవెళ్ల ప్రాంతం, కవ్వాల్ టైగర్ రిజర్వ్, నల్లమల అటవీ ప్రాంతం, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, కాళేశ్వరం ప్రాజెక్టు వంటి అనేక ఎకో టూరిజం ప్రాంతాలు ఉన్నాయని అన్నారు. ఐటీ కంపెనీల సీఈవోలు తమ కుటుంబాలతో కలిసి రాష్ట్రంలోని ఎకో టూరిజం ప్రాంతాలను సందర్శించి, అక్కడ ఒకటి రెండు రోజులు గడపాలని కోరారు. పర్యాటక ప్రాంతాల్లో తీసిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం ద్వారా తెలంగాణ టూరిజానికి విస్తృత ప్రచారం లభిస్తుందని అన్నారు.
మూసీ పునరుజ్జీవనం, ఫ్యూచర్ సిటీపై ప్రత్యేక దృష్టి :
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు హైదరాబాద్‌లో చేపట్టనున్న ప్రధాన అభివృద్ధి కార్యక్రమాల్లో ఒకటని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ ప్రాజెక్టు ఆలోచన ప్రారంభంలో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, ప్రస్తుతం మొదటి విడత పనులు ప్రారంభమయ్యాయని, త్వరలోనే పనులు మరింత ముందుకు సాగనున్నాయని చెప్పారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి కృషి నిబద్ధతతో కృషి చేస్తోందని ఆయన వివరించారు. గతంలో హైటెక్ సిటీ నిర్మాణం చేపట్టినప్పుడు కూడా అది సాధ్యమవుతుందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయని, నేడు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నగరంలోకి ప్రవేశించే సమయంలో కనిపించే ఎత్తైన భవనాలు హైదరాబాద్ అభివృద్ధిని ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు. అదే తరహాలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి పనులు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లకు తోడుగా భారత్ ఫ్యూచర్ సిటీ కూడా అభివృద్ధి చెందడం ద్వారా నగర విస్తరణకు, ఆర్థిక ప్రగతికి మరింత ఊతం లభిస్తుందని భట్టి విక్రమార్క అన్నారు.
ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులకు ఆహ్వానం :
హైదరాబాద్ దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు అనుసంధానంగా ఉన్న వ్యూహాత్మక నగరమని ఆయన చెప్పారు. ఇక్కడ ప్రతిభావంతులైన మానవ వనరులు, అనుకూలమైన వాతావరణం, మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఐటీ రంగానికి చెందిన సీఈవోలు, పారిశ్రామికవేత్తలు ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. రాబోయే డిసెంబర్‌లో 'ఇన్వెస్ట్ తెలంగాణ' సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సదస్సు ప్రచారంలో భాగంగా హైదరాబాద్, ఢిల్లీతోపాటు దేశంలోని ఇతర నగరాల్లో, విదేశాల్లోనూ రోడ్‌షోలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఐటీ సంస్థలు, పారిశ్రామికవేత్తలు భాగస్వాములై తెలంగాణలో, ముఖ్యంగా ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు.
ఎకో, ఫారెస్ట్, టెంపుల్ టూరిజానికి ప్రోత్సాహం :
రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధిలో ఐటీ సంస్థలు భాగస్వాములు కావాలని భట్టి విక్రమార్క కోరారు. పర్యాటక శాఖ ప్రకటించిన మేరకు సాఫ్ట్‌వేర్ కంపెనీల సీఈవోలకు ఉచిత కూపన్లు అందించే కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ, వారు కుటుంబాలతో కలిసి తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని సూచించారు. ఐటీ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులను కూడా వారాంతాల్లో ఎకో టూరిజం, ఫారెస్ట్ టూరిజం, టెంపుల్ టూరిజం ప్రాంతాలకు వెళ్లేలా ప్రోత్సహించాలని కోరారు. నీటిపారుదల ప్రాజెక్టుల వద్ద అందుబాటులో ఉన్న గెస్ట్‌హౌస్‌లను వినియోగించుకోవడం ద్వారా పర్యాటకులకు వసతి సౌకర్యాలు కల్పించవచ్చని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, పర్యాటక రంగ విస్తరణలో ఐటీ సంస్థల సీఈవోలు, పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం, పరిశ్రమలు సమన్వయంతో పనిచేస్తూ 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.