2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం
హైదరాబాద్, సూర్య ప్రధాన ప్రతినిధి :2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పారిశ్రామికీకరణ, పర్యాటకం, ఇంధన రంగాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో ఎకో టూరిజాన్ని ప్రోత్సహించడంలో భాగంగా పలు ఐటీ సంస్థల సీఈఓలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు వారాంతపు పర్యాటక అవకాశాలను అందుబాటులోకి తీసుకురావాలని భట్టి విక్రమార్క కోరారు. ఐటీ, పర్యాటక, నీటిపారుదల, అటవీ శాఖల సమన్వయంతో స్పష్టమైన కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లు, నల్లమల అటవీ ప్రాంతం, ప్రణహిత-చేవెళ్ల, కాళేశ్వరం వంటి ఎకో టూరిజం ప్రాంతాలను ఐటీ సీఈఓలు తమ కుటుంబాలతో సందర్శించి, సోషల్ మీడియా ద్వారా తెలంగాణ టూరిజానికి ప్రచారం కల్పించాలని సూచించారు.
అలాగే నగరాభివృద్ధిలో మూసీ పునరుజ్జీవనం, భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం అత్యంత కీలకమైనవని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గతం లో హైటెక్ సిటీ తరహాలోనే ఫ్యూచర్ సిటీ కూడా హైదరాబాద్ ఆర్థిక ప్రగతికి ఊతం ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే డిసెంబర్‌లో నిర్వహించనున్న 'ఇన్వెస్ట్ తెలంగాణ' సదస్సులో భాగస్వాములై ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. ప్రభుత్వం, పరిశ్రమలు సమన్వయంతో పనిచేస్తూ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.