రూ.248 కోట్లతో నర్సీపట్నం మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి! రూ.3 కోట్లతో వాకింగ్ ట్రాక్, కళ్యాణ మండపం పనులకు శ్రీకారం : స్పీకర్ అయ్యన్నపాత్రుడు
నర్సీపట్నం అక్టోబర్ 9 మేజర్ న్యూస్ : నర్సీపట్నం మున్సిపాలిటీ చరిత్రలో మునుపెన్నడూ చూడని విధంగా సమగ్ర అభివృద్ధి పరుగులు పెడుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం రెండేళ్ల మూడు నెలల వ్యవధిలోనే ఏకంగా రూ. 248 కోట్లతో మున్సిపాలిటీ రూపురేఖలను మార్చేస్తూ సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ ప్రగతిలో భాగంగా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద బొడ్డేపల్లి చెరువు వద్ద రూ. 1 కోటి 80 లక్షలతో నిర్మించనున్న వాకింగ్ ట్రాక్ పనులకు, అలాగే బలిఘట్టం ఉత్తరవాహిని వద్ద రూ. 1 కోటి 20 లక్షలతో నిర్మించనున్న కళ్యాణ మండపం పనులకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం అనంతరం గౌరవ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి కేవలం 2 ఏళ్ల 3 నెలల్లో మున్సిపాలిటీలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని స్పష్టం చేశారు.
మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు నిధుల వరద పారిస్తున్నట్లు స్పీకర్ వివరించారు. ఇప్పటివరకూ మొత్తం 325 పనులకు గాను రూ. 28 కోట్ల 69 లక్షలు మంజూరు చేశామన్నారు. వీటిలో వీఎంఆర్‌డీఏ ఫేజ్-1 కింద 43 పనులకు రూ. 4 కోట్ల 11 లక్షలు, ఫేజ్-2 కింద 64 పనులకు రూ. 5 కోట్లు, ఫేజ్-3 కింద 81 పనులకు రూ. 8 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నిధుల కింద 148 పనులకు రూ. 10 కోట్ల 58 లక్షలు, డీఎంఎఫ్‌టీ నిధుల కింద 15 పనులకు రూ. 1 కోటి మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ నిధులతో ఇప్పటికే రూ. 14 కోట్ల 16 లక్షల వ్యయంతో 196 పనులు పూర్తి కాగా, మరో రూ. 14 కోట్ల 53 లక్షలతో 129 పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. అలాగే వీఎంఆర్‌డీఏ గ్రాంట్ కింద కేటాయించిన రూ. 25 కోట్లతో 204 పనులు చేపట్టగా, అందులో 201 పనులు కేవలం సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలకే వెచ్చించామని, వీధి దీపాల కోసం మరో రూ. 2 కోట్లు కేటాయించామని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.
పారిశుధ్యం, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తూ పలు భారీ ప్రాజెక్టులను మున్సిపాలిటీలో చేపడుతున్నట్లు స్పీకర్ తెలిపారు. నర్సీపట్నం ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ. 186 కోట్లతో సమగ్ర రక్షిత త్రాగునీటి ప్రాజెక్టును అమలు చేస్తున్నామన్నారు. అలాగే రూ. 3 కోట్లతో తడి, పొడి చెత్త ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణం, రూ. 1 కోటి 70 లక్షలతో ఫిష్ పాండ్ అభివృద్ధి, రూ. 2 కోట్లతో బర్త్ వెయిటింగ్ హాల్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. వైద్య సేవలను మెరుగుపరచడంలో భాగంగా రూ. 35 లక్షలతో అంబులెన్స్, 5 తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. అంతేకాకుండా రూ. 1 కోటి 4 లక్షల సీఎస్‌ఆర్ గ్రాంటుతో ఆరు శ్మశానవాటికలను అభివృద్ధి చేశామని, రూ. 32 లక్షలతో 125 కొత్త కరెంట్ స్తంభాలు వేయడంతో పాటు, వార్డుల్లో 700 కొత్త వీధి లైట్లు ఏర్పాటు చేసి, వెలగని 1900 లైట్లకు మరమ్మతులు చేయించామని వివరించారు. ముఖ్యంగా కంపోస్ట్ యార్డులో ఏళ్లుగా పేరుకుపోయిన 30 వేల టన్నుల చెత్తను వైజాగ్ జిందాల్ విద్యుత్ ప్లాంట్‌కు తరలించి పారిశుద్యాన్ని మెరుగుపరిచామన్నారు.
రాబోయే రోజుల్లో నర్సీపట్నం సమగ్ర అభివృద్ధిలో భాగంగా రూ. 45 కోట్లతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు కాంక్రీట్ వాల్, మున్సిపాలిటీ వ్యాప్తంగా రూ. 52 కోట్లతో డ్రైన్ల నిర్మాణ పనులు ప్రతిపాదన దశలో ఉన్నాయని స్పీకర్ వివరించారు. గత రెండేళ్ల వ్యవధిలో నర్సీపట్నం మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేసి సహకరిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్‌లకు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ ఛార్జ్ సూర్యచంద్ర, నర్సీపట్నం మున్సిపాలిటీ టీడీపీ నాయకులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.