శీనయ్యకు..జిల్లా పెద్ద బాధ్యతలు..!
విజయనగరం, మేజర్ న్యూస్: రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ పడుతున్న కష్టాన్ని చూసి తనవంతు చేయూత అందించే ఉద్దేశంతో టీడీపీలో చేరినట్టు చిన్నశ్రీను చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరినప్పటినుంచి చెబుతున్నమాట. టీడీపీతో ఎటువంటి ఒప్పందం జరగలేదని , భేషరతుగానే చేరానని వినిపిస్తున్న డైలాగ్. కానీ, ఏదీలేకుండా ఆయన ఇంత సంచలనానికి కారణమయ్యే నిర్ణయం తీసుకుంటారా అనేది పరిశీలకుల అభిప్రాయం.
టీడీపీతో ఎటువంటి ఒప్పందం జరగలేదని చిన్నశ్రీను అండ్ కో బయటకు చెబుతున్నప్పటికీ, లోలోపల గట్టి అగ్రిమెంటు జరిగే ఉంటుందని సత్తిబాబు అభిమానులు బల్లగుద్ది మరీ చేస్తున్న ప్రచారం. చంద్రబాబు, చిన్నశ్రీను మధ్య బిగ్ డీల్ పై కూడా చర్చలు నడుస్తున్నాయి. చిన్నశ్రీనుకు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలతోపాటు ఎమ్మెల్సీ ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖత వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. అలాగే, సమీకరణాలు, సర్దుబాట్లు కుదిరితే, ఒకవేళ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ లేదా విస్తరణ జరిగితే చిన్నశ్రీనుకి చోటు కల్పించేందుకు కూడా ఒప్పందం కుదిరిందని జరుగుతున్న ప్రచారం. ఆయన కుమార్తె సిరి సహస్రను జెడ్పీ చైర్ పర్సన్ లేదా విజయనగరం మేయర్ చేసేందుకు కూడా డీల్ కుదిరిందనే చర్చ సాగుతోంది.
చిన్నశ్రీను మాత్రం జిల్లా చంద్రబాబు రాష్ట్రం కోసం పడుతున్న కష్టం, ఉప ముఖ్యమంత్రి తపన నన్ను అటువైపు నడిపించేలా చేసిందని చెప్పుకొస్తున్నారు. ఆయన నోటివెంట ఒప్పందం అనే మాట వినిపించడంలేదు. ఇలాఉండగా, చిన్నశ్రీను టీడీపీలో చేరడాన్ని వైసిపి శ్రేణులు ఇప్పటికీ నమ్మలేకపొతున్నారు. షాక్ నుంచి తేరుకోలేకపోతున్నామని స్వయంగా వారే వ్యాఖ్యానించడంబట్టి వారెంత గందరగోళంలో ఉన్నదీ ఊహించవచ్చు. మరోవైపు, క్షేత్రస్థాయిలో నిన్నటివరకు ఉప్పు నిప్పులా ఉండే టీడీపీ, వైసీపీ కేడర్ తాజా పరిణామాల నేపథ్యంలో ఎంతవరకు సఖ్యత పాటిస్తారనేది వేచిచూడాల్సి ఉంటుంది. అంతేకాకుండా, స్థానిక ఎన్నికల్లో ఎంతమేర సమన్వయంతో వ్యవహరిస్తారనేది కూడా ప్రస్తుతానికి అంచనాకు అందడంలేదు. చిన్నశ్రీను జిల్లా సారధ్య బాధ్యతలు స్వీకరించాక దీనిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించే అవకాశం ఉందని అంటున్నారు. ఏదేమైనప్పటికీ, వైసీపీ జిల్లా సమన్వయకర్తగా గత సార్వత్రిక, స్థానిక ఎన్నికల్లో జిల్లాలో అద్భుత ఫలితాలు సాధించిన చిన్నశ్రీనుకు, మరో మూడేళ్ళలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా చెప్పుకునే ప్రస్తుత స్థానిక ఎన్నికల్లో టీడీపీని ఎంతమేర విజయతీరాలకు చేర్చుతారనేది ఆసక్తికరంగా మారింది. టీడీపీలో చేరిన క్రమంలో చిన్నశ్రీను త్వరలోనే కార్యక్షేత్రంలోకి దూకే సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. చిన్నశ్రీను టీడీపీలో చేరిక కార్యక్రమానికి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రి, ఇంచార్జి మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు హాజరవడంబట్టి ఇదంతా ప్రీప్లాన్డ్ గానే జరిగినట్టు తేటతెల్లమవుతున్నందున విస్తృత స్థాయి సమావేశం అనేది లాంఛనప్రాయమేనని చెబుతున్నారు. మొత్తమ్మీద, చిన్నశ్రీను పార్టీమార్పు ఏ సంచలనాలకు కేంద్రబిందువు కానుందో వేచిచూడాల్సి ఉంది. *గన్ మెన్ లు కేటాయింపు: : తాజా మాజీ జడ్పి చైర్మన్ చిన్న శ్రీను కు గన్ మెన్ కేటాయించింది. గతంలో జడ్పీ చైర్మన్ గా పని చేసిన కాలంలో గన్ మెన్ తొలగించిన ప్రభుత్వం ఇప్పుడు ఆ పదవి కాలం ముగిసి టీడీపీ కండువా కప్పుకున్న తర్వాత వన్ ప్లస్ వన్ గన్ మెన్ లు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది.