పుష్కరాల నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలి : దేవస్థాన అభివృద్ధి పనులపై దేవాదాయశాఖ కమిషనర్ సమీక్ష
కొత్తపేట,మేజర్ న్యూస్:2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని మందపల్లి శ్రీ మందేశ్వర (శనేశ్వర) స్వామివారి దేవస్థానంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ దేవదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ అధికారులను ఆదేశించారు.శనివారం సాయంత్రం ఆయన దేవస్థానాన్ని సందర్శించి,భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న తైలాభిషేక మండపం,అన్నప్రసాద భవనం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాలను సందర్శించిన కమిషనర్ పనుల పురోగతిని ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.నిర్మాణాల నాణ్యత విషయంలో రాజీ పడకుండా,నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని సూచించారు.అనంతరం పనుల పురోగతిపై సమీక్షించి,నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.
పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో,వారికి అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు నిర్మాణ పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిసింది.ఈ పర్యటనలో దేవదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ వేండ్ర త్రినాధరావు,టెక్నికల్ అడ్వైజర్ సుబ్బారావు,ఎస్‌ఈ దుర్గేశ్ కుమార్,డీఈ ఉదయ్ కుమార్,డిప్యూటీ స్థపతి సతీష్,ఆలయ ఈవో దారపురెడ్డి సురేష్ బాబు,దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు,సిద్ధంశెట్టి సత్యనారాయణ, చింతం విజయ కృష్ణ మోహన్ రావు,ఇతర గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.