ఉత్తర కొరియా ముప్పుపై దక్షిణ కొరియా, జపాన్ రక్షణ శాఖల కీలక భేటీ:
సూర్య అంతర్జాతీయ డెస్క్: ఉత్తర కొరియా చేపడుతున్న అణు పరీక్షలు, క్షిపణి ప్రయోగాల ముప్పును సంయుక్తంగా ఎదుర్కొనేందుకు దక్షిణ కొరియా, జపాన్ దేశాలు తమ రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి. టోక్యో వేదికగా జరిగిన ఉన్నత స్థాయి ద్వైపాక్షిక రక్షణ సమావేశంలో దక్షిణ కొరియా రక్షణ శాఖ ఉప మంత్రి లీ దూ-హీ, జపాన్ రక్షణ శాఖ ప్రతినిధి అత్సుషి ఆండోలతో విస్తృతంగా చర్చలు జరిపారు. కొరియన్ ద్వీపకల్పంలో నెలకొన్న తీవ్ర భద్రతా సవాళ్లు, అంతర్జాతీయ భద్రతా పరిణామాల నేపథ్యంలో పరస్పర సమన్వయం అత్యంత కీలకమని ఇరు పక్షాలు పునరుద్ఘాటించాయి.
ఉత్తర కొరియా వరుస క్షిపణి కవ్వింపు చర్యలను సమర్థవంతంగా అడ్డుకోవడానికి సియోల్, టోక్యోలతో పాటు అమెరికాతో కూడిన త్రైపాక్షిక భద్రతా వ్యవస్థను మరింత విస్తరించాలని ఈ భేటీలో ఏకాభిప్రాయానికి వచ్చారు. రియల్-టైమ్ మిస్సైల్ వార్నింగ్ డేటా మార్పిడి, సంయుక్త సైనిక విన్యాసాలు మరియు సముద్ర భద్రతను పటిష్టం చేయాలని నిర్ణయించారు. దీనితో పాటు రక్షణ రంగంలో సరికొత్త పుంతలు తొక్కుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), అన్‌మ్యాన్డ్ సిస్టమ్స్ (డ్రోన్లు), అత్యాధునిక సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాల్లో ఉమ్మడి పరిశోధనలు, భవిష్యత్ కార్యాచరణను ముందుకు తీసుకెళ్లాలని అంగీకరించారు.
ఈ పర్యటనలో భాగంగా దక్షిణ కొరియా ఉప మంత్రి లీ.. జపాన్ రక్షణ మంత్రి షింజిరో కొయిజుమితో కూడా మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. గత కొంతకాలంగా మెరుగుపడుతున్న దౌత్య సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాంతీయ మిత్రదేశాల మధ్య సైనిక సహకారం తప్పనిసరి అని ఇరు దేశాల ప్రతినిధులు స్పష్టం చేశారు.