తెలంగాణ మోడల్ స్కూల్‌లో ముందస్తుగా ఘనంగా బతుకమ్మ వేడుకలు.
సూర్య కాల్వ శ్రీరాంపూర్:పెద్దపల్లి జిల్లా.(కాల్వ శ్రీరాంపూర్) కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని
పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్, మల్లియాల నందు శుక్రవారం రోజున ముందస్తుగా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని విద్యార్థినులు రంగురంగుల పుష్పాలతో అందమైన బతుకమ్మలను తయారు చేసి, సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మ పాటలు, నృత్యాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు .ఈ సందర్భంగా విద్యార్థులకు బతుకమ్మ పండుగ యొక్క సాంస్కృతిక, సామాజిక, పర్యావరణ ప్రాధాన్యతను వివరించారు. తెలంగాణ సంప్రదాయాలు, జానపద కళలు మరియు మన సంస్కృతిని విద్యార్థుల్లో పెంపొందించేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ సిరిమల్లె మహేష్, మల్లియాల సర్పంచ్ సదాశివ రెడ్డి, ఏ ఏ పీ సి చైర్మన్ మదీనా పాల్గొని విద్యార్థులను అభినందించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ అనుముల పోచయ్య మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. విద్యార్థులు మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించి, వాటి పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, కళాశాల అధ్యాపకుల బృందం విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు