తాండూరు, బషీరాబాద్ పీఏసీఎస్‌లపై హైకోర్టు తీర్పు నేడే…!
పీఐసీ, ఎన్‌పీఐసీ నియామకాలపై మాజీ చైర్మన్ల పిటిషన్.. ఎన్నికలు జరిగే వరకు తమనే కొనసాగించాలని డిమాండ్
ఇటీవల తాత్కాలిక చైర్మన్లుగా ఎన్నికైన కరుణ అజయ్ ప్రసాద్, జనార్దన్‌రెడ్డి పదవులపై ఉత్కంఠ
తాండూరు/బషీరాబాద్, మేజర్ న్యూస్ : తాండూరు, బషీరాబాద్ మండలాల్లోని పీఏసీఎస్‌లలో చోటుచేసుకున్న తాజా పరిణామాలపై హైకోర్టు తీర్పు బుధవారం వెలువడనుండటంతో ఉత్కంఠ నెలకొంది. పర్సన్-ఇన్‌చార్జ్ (పీఐసీ) నియామకాలను తొలగించడంతో పాటు నాన్ అఫీషియల్ పర్సన్ ఇన్‌చార్జ్ (ఎన్‌పీఐసీ)ల నియామకాలను రద్దు చేయాలని కోరుతూ మాజీ చైర్మన్లు రవి గౌడ్, వెంకట్రాంరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.తమను చైర్మన్ పదవుల నుంచి తొలగించేందుకు చూపిన కారణాలపై అభ్యంతరం వ్యక్తం చేసిన మాజీ చైర్మన్లు.. పీఏసీఎస్‌లకు ఎన్నికలు జరిగే వరకు తమనే చైర్మన్లుగా కొనసాగించాలని పిటిషన్‌లో కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన తాజా నియామకాలపై న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం వెలువరిస్తుందన్న అంశం ఆసక్తికరంగా మారింది.ఇదిలా ఉండగా, ఇటీవల తాత్కాలిక చైర్మన్లుగా ఎన్నికైన కరుణ అజయ్ ప్రసాద్, జనార్దన్‌రెడ్డిల పదవులపై కూడా హైకోర్టు తీర్పు ప్రభావం పడే అవకాశం ఉందన్న చర్చ ఆయా మండలాల్లో సాగుతోంది. పీఏసీఎస్‌ల పాలక వ్యవహారాలకు సంబంధించి కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందన్న దానిపై రెండు మండలాలకు చెందిన సహకార సంఘాల నాయకులు, మాజీ చైర్మన్లు, రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.మాజీ చైర్మన్లు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అయితే తీర్పు వెలువడిన తర్వాతే పీఏసీఎస్‌ల తదుపరి పరిణామాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో తాండూరు, బషీరాబాద్ మండలాల్లో నేటి హైకోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
తాండూరు, బషీరాబాద్ రిపోర్టర్లు: రామ్ చందర్,కాశీం పాషా.