వన్యప్రాణుల సంరక్షణపై అవగాహనకు 2కే రన్
మార్కాపురం మేజర్ న్యూస్
వన్యప్రాణి వారోత్సవాలను పురస్కరించుకుని వన్యప్రాణుల సంరక్షణ, అడవుల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మార్కాపురంలో 2కే రన్ నిర్వహించారు. మార్కాపురంలోని అటవీ శాఖ కార్యాలయం వద్ద బుధవారం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి 2కే రన్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యేతో పాటు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది 2కే రన్‌లో పాల్గొన్నారు. వన్యప్రాణులు, అటవీ సంపద పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. అడవుల విస్తీర్ణాన్ని కాపాడటంతో పాటు వన్యప్రాణుల ఆవాసాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
వన్యప్రాణుల సంరక్షణపై ప్రజలకు అవగాహన పెంచడం, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను తెలియజేయడం, అడవులు–వన్యప్రాణుల ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లడమే వన్యప్రాణి వారోత్సవాల ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.