గత నెలలో రూ. 1,345 కోట్ల విలువైన పనులు పూర్తి.. వేగం మరింత పెంచాలని ఆదేశం! సీఎం చంద్రబాబు
సూర్య అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన క్యాంప్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణతో పాటు రాజధాని పరిధిలో వివిధ ప్రాజెక్టులను చేపడుతున్న నిర్మాణ సంస్థల (కాంట్రాక్టింగ్ ఏజెన్సీలు) ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
రాజధాని ప్రాంతంలో గత నెల రోజుల్లో జరిగిన నిర్మాణ పనుల ప్రగతిని అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. గడిచిన నెల రోజుల్లోనే నిర్మాణ సంస్థలు రికార్డు స్థాయిలో రూ. 1,345 కోట్ల విలువైన అభివృద్ధి, మౌలిక వసతుల పనులను పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఈ పురోగతిపై సీఎం సంతృప్తి వ్యక్తం చేస్తూనే.. రాబోయే రోజుల్లో పనుల వేగాన్ని మరింత విస్తరించి నెలకు రూ. 2 వేల కోట్ల మార్కును చేరుకోవాలని స్పష్టం చేశారు.
అమరావతిలో ప్రధాన రహదారులు, వరద నివారణ కాలువలు, మురుగునీటి పారుదల, తాగునీరు మరియు విద్యుత్ లైన్ల వంటి ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. అదేవిధంగా ఐకానిక్ భవనాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్, న్యాయమూర్తులు మరియు ప్రభుత్వ ఉద్యోగుల గృహ నిర్మాణ పనులను వేగవంతం చేసి నివాసయోగ్యంగా మార్చాలని సూచించారు. నిర్మాణ సంస్థలకు ఎలాంటి సమస్యలు, బిల్లుల చెల్లింపుల్లో ఆటంకాలు లేకుండా చూస్తామని, ఎక్కడా నాణ్యత లోపించకుండా రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు అంకితభావంతో పనిచేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.