ఇరాన్ యుద్ధ నష్టాలు, మౌలిక వ్యయాలను ప్రపంచం పంచుకోవాల్సిందే: మధ్యప్రాచ్య చమురు దిగ్గజాల హెచ్చరిక!
సూర్య అంతర్జాతీయ డెస్క్: ఇరాన్ యుద్ధం కారణంగా దెబ్బతిన్న ఇంధన మౌలిక సదుపాయాల పునర్నిర్మాణం, రవాణా మార్గాల పునరుద్ధరణ మరియు భవిష్యత్ సరఫరా భద్రత కోసం అయ్యే భారీ వ్యయ భారాన్ని ప్రపంచ దేశాలు కూడా సమానంగా పంచుకోవాల్సి ఉంటుందని మధ్యప్రాచ్యానికి చెందిన అగ్రగామి చమురు సంస్థల అధిపతులు స్పష్టం చేశారు. లండన్‌లో జరిగిన ప్రతిష్టాత్మక ‘ఎనర్జీ ఇంటెలిజెన్స్ ఫోరమ్’ (Energy Intelligence Forum) సదస్సులో సౌదీ ఆరామ్‌కో సీఈవో అమీన్ నాసర్, కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ (KPC) చీఫ్ షేక్ నవాఫ్ అల్-సబా కీలక ప్రసంగం చేస్తూ ప్రపంచ ఇంధన వినియోగ దేశాలకు ఈ హెచ్చరిక జారీ చేశారు.
ఇరు దేశాల చమురు దిగ్గజాల వివరాల ప్రకారం.. యుద్ధ వాతావరణం కారణంగా పైప్‌లైన్లు, రిఫైనరీలు, గ్యాస్ ప్రాసెసింగ్ కేంద్రాలు మరియు డజన్ల కొద్దీ చమురు ట్యాంకర్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నష్టాల భర్తీకి, నూతన ఎగుమతి మార్గాలు మరియు విదేశీ నిల్వ కేంద్రాల (ఓవర్‌సీస్ స్టోరేజ్) ఏర్పాటుకు పదుల బిలియన్ డాలర్ల అదనపు పెట్టుబడులు అవసరమవుతాయి. ఏ ఒక్క ఉత్పత్తి దేశం కూడా ఈ భారీ ఆర్థిక భారాన్ని ఒంటరిగా మోయలేదని సౌదీ ఆరామ్‌కో సీఈవో అమీన్ నాసర్ తేల్చిచెప్పారు. చమురు, గ్యాస్ మౌలిక సదుపాయాలు కేవలం ఉత్పత్తిదారుల బాధ్యత మాత్రమే కాదని, అవి వినియోగదారులు, ఉత్పత్తిదారులు ఉమ్మడిగా పెట్టుబడి పెట్టాల్సిన అత్యవసర రక్షణ కవచమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా చమురు నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయని, సంక్షోభం ఇప్పుడే ముగిసినా తగ్గిపోయిన నిల్వలను భర్తీ చేయడానికే రాబోయే రెండేళ్ల పాటు రోజుకు అదనంగా 20 లక్షల బ్యారెళ్ల డిమాండ్ ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
యూరప్ దేశాలు కువైట్ నుంచి డీజిల్, జెట్ ఫ్యూయల్ వంటి శుద్ధి చేసిన ఇంధనాల నిరంతర సరఫరాను కోరుకుంటే, సంబంధిత నిల్వ సదుపాయాల కోసం యూరప్ కూడా పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టాలని కువైట్ పెట్రోలియం అధిపతి షేక్ నవాఫ్ స్పష్టం చేశారు. వినియోగ మార్కెట్లకు సమీపంలో మరింత ఇంధనాన్ని నిల్వ ఉంచేలా లాజిస్టికల్ పెట్టుబడులు పెట్టడంపై తాము ఇప్పటికే యూరోపియన్ భాగస్వాములతో చర్చిస్తున్నట్లు వెల్లడించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా గొలుసును దెబ్బతీస్తున్న నేపథ్యంలో, సరఫరా స్థిరత్వం కోసం వినియోగ దేశాలు కూడా భాగస్వామ్యం వహించక తప్పదని చమురు దేశాల అధిపతులు తేల్చిచెప్పారు.