‘జనసేవ నుంచి దేశసేవ వరకు’: ప్రధాని మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రశంసలు!
సూర్య జాతీయ డెస్క్: రాజ్యాంగ అధినేతగా, ప్రభుత్వ సారథిగా నిరంతరాయంగా 25 సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమైన మోదీ నాయకత్వ ప్రస్థానం.. నేడు భారత ప్రధానిగా దేశాన్ని విశ్వగురు స్థానానికి తీసుకెళ్లే వరకు ‘జనసేవ నుంచి దేశసేవ’ దిశగా సాగిన అద్భుత ప్రయాణమని ఆయన కొనియాడారు.
మోదీ నాయకత్వం భారత రాజకీయ చరిత్రలోనే ఒక స్వర్ణ అధ్యాయమని సీఎం యోగి అభివర్ణించారు. "ఎక్కడా ఆగకుండా, అలసిపోకుండా, సంకల్పం వీడకుండా ‘చరైవేతి, చరైవేతి’ (నిరంతరం ముందుకు సాగడం) అన్న మంత్రంతో ప్రధాని మోదీ పాతికేళ్ల ప్రజాసేవను కొనసాగించారు. 'నేషన్ ఫస్ట్' (దేశమే ప్రథమం) అనే ఏకైక భావనతో 140 కోట్ల మంది భారతీయుల సంక్షేమం, స్వావలంబన కోసం ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారు" అని యోగి పేర్కొన్నారు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా సుపరిపాలనను దేశంలోని మారుమూల గ్రామాలకూ చేర్చారని చెప్పారు.
దేశంలో దాదాపు 25 కోట్ల మందిని దారిద్ర్య రేఖ నుంచి విముక్తులను చేయడం ప్రధాని మోదీ నాయకత్వంలో సాధించిన చారిత్రక విజయమని కొనియాడారు. జన్‌ధన్, పీఎం ఆవాస్, ఉజ్వల, ఆయుష్మాన్ భారత్ వంటి సంక్షేమ పథకాలతో పేదల జీవన ప్రమాణాలను పెంచడంతో పాటు.. ఎక్స్‌ప్రెస్‌వేలు, రైల్వేలు, డిజిటల్ విప్లవం, రక్షణ తయారీ రంగాల్లో దేశాన్ని సరికొత్త ఎత్తులకు చేర్చారని తెలిపారు. ఆధునిక భారతదేశాన్ని ప్రపంచంలోనే శక్తిమంతమైన దేశంగా తీర్చిదిద్దుతున్న ప్రధాని నరేంద్ర మోదీకి సంపూర్ణ ఆయురారోగ్యాలు కలగాలని, ఆయన నాయకత్వంలో దేశం 'వికసిత్ భారత్' లక్ష్యాన్ని త్వరితగతిన చేరుకోవాలని యోగి ఆదిత్యనాథ్ ఆకాంక్షించారు.