త్రిపుర విలేజ్ కమిటీ ఎన్నికల ఫలితాలతో సీపీఎం-కాంగ్రెస్‌లను ప్రజలు తిరస్కరించినట్లు రుజువైంది: సీఎం మాణిక్ సాహా
సూర్య జాతీయ డెస్క్: త్రిపుర గిరిజన ప్రాంతాల్లోని గ్రామ కమిటీలకు (Village Committees) ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు ప్రతిపక్ష సీపీఎం, కాంగ్రెస్ పార్టీల కాలం చెల్లిన సిద్ధాంతాలను ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించినట్లు మరోసారి నిరూపించాయని ముఖ్యమంత్రి ప్రొఫెసర్ డాక్టర్ మాణిక్ సాహా వ్యాఖ్యానించారు. గిరిజన స్వయంప్రతిపత్త ప్రాంతాల్లో ఎన్డీయే కూటమి (బీజేపీ–తిప్రా మోథా పార్టీ) సాధించిన ఘన విజయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి 90 శాతానికి పైగా స్థానాలను కైవసం చేసుకుంటుందని తాను ముందే ఊహించానని, ఫలితాలు తాము ఆశించిన దానికంటే అత్యుత్తమంగా వచ్చాయని సీఎం సాహా తెలిపారు. ప్రజలు సుపరిపాలన, అభివృద్ధి పక్షాన నిలిచారని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల్లో పరాజయం పాలైన ప్రతిసారీ ప్రతిపక్షాలు ఈవీఎంలు, ఎన్నికల సంఘంపై నిందలు మోపడం అలవాటుగా మార్చుకున్నాయని, గ్రామ కమిటీ ఫలితాల తర్వాత కూడా అదే పాత నాటకాన్ని రిపీట్ చేస్తున్నాయని మండిపడ్డారు. విపక్షాలు మాట్లాడే సాంప్రదాయ రాజకీయాలు ఇక ఏనాటికీ ప్రజల ఆమోదం పొందలేవని ఎద్దేవా చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గిరిజనులు (జనజాతి), మైదాన ప్రాంత ప్రజలు (జాతి), మణిపురీలు, మైనార్టీలతో సహా అన్ని వర్గాలను కలుపుకుంటూ సరికొత్త ‘నవ త్రిపుర’ను నిర్మించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం పునరుద్ఘాటించారు. పర్వత, మైదాన ప్రాంతాల మధ్య ఎలాంటి అంతరాలు లేకుండా సమగ్రాభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు ఈ ఎన్నికల తీర్పు తమ బాధ్యతను మరింత పెంచిందని ఆయన పేర్కొన్నారు.