టాటా సన్స్ లిస్టింగ్ వివాదం: వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్‌లపై ఎస్‌డీటీటీ ట్రస్టీల తీవ్ర ఆగ్రహం.. బోర్డు తీర్మానాలను ఉల్లంఘించారని ఆరోపణ!
సూర్య కార్పొరేట్ డెస్క్: దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక పారిశ్రామిక సామ్రాజ్యం టాటా గ్రూప్‌లో అంతర్గత వివాదాలు మరోసారి ముదిరాయి. టాటా సన్స్ హోల్డింగ్ కంపెనీని స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేసే అంశంపై ‘సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్’ ట్రస్టీల మధ్య తీవ్ర విభేదాలు భగ్గుమన్నాయి. బోర్డు ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయాలను ఉల్లంఘిస్తూ, బహిరంగంగా లిస్టింగ్‌కు అనుకూలంగా ప్రకటనలు చేయడం ద్వారా ట్రస్టీల విశ్వసనీయతకు భంగం కలిగించారంటూ సహచర ట్రస్టీలు వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్‌లపై నలుగురు సీనియర్ ట్రస్టీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ లేఖ రాశారు.
టాటా సన్స్‌లో దాదాపు 66 శాతం వాటా కలిగిన టాటా ట్రస్ట్స్.. టాటా సన్స్‌ను అన్‌లిస్టెడ్ (ప్రైవేట్) కంపెనీగానే కొనసాగించాలని మార్చి 2024, మే 2025 మరియు జూలై 2025లలో స్పష్టమైన తీర్మానాలను ఆమోదించింది. దివంగత రతన్ టాటా హయాం నుంచి ఈ వైఖరిని స్పష్టంగా పాటిస్తూ వస్తున్నారు. ఆ తీర్మానాల్లో భాగస్వాములుగా ఉన్న వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్.. బోర్డులో ఎలాంటి అంతర్గత చర్చ జరపకుండానే బహిరంగంగా లిస్టింగ్‌కు మద్దతు ఇవ్వడం ట్రస్ట్ నిర్ణయాధికారాన్ని బలహీనపరచడమేనని ఇతర ట్రస్టీలు విమర్శించారు. ఈ వైఖరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.
ఆర్‌బీఐ ఎన్‌బీఎఫ్‌సీ నిబంధనల నుంచి తప్పించుకునేందుకు పబ్లిక్ లిస్టింగ్‌కు బదులుగా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని టాటా సన్స్ బోర్డు స్వయంగా కోరినట్లు ట్రస్టీలు గుర్తుచేశారు. ఈ క్రమంలో టాటా ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ సొల్యూషన్స్, టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్‌ను టాటా సన్స్‌తో విలీనం చేయడం వంటి ప్రత్యామ్నాయాలు పరిశీలనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో, అంతర్గత వేదికలపై కాకుండా బాహ్యంగా భిన్న వైఖరి ప్రదర్శించడం బోర్డు నియమావళికి విరుద్ధమని స్పష్టం చేయడంతో టాటా ట్రస్ట్స్ పాలనా వ్యవహారాల్లో (కార్పొరేట్ గవర్నెన్స్) ఈ పరిణామం తీవ్ర దుమారాన్ని రేపుతోంది.