ఓకే ఫోన్ ..రూ కోట్ల ఆయిల్ దందా!
ఒకే ఫోన్.. రూ.కోట్ల ఆయిల్ దందా!
గుజరాత్, మహారాష్ట్ర, బెంగాల్ నుంచి ఏపీ తీర ప్రాంతాలకు ‘నకిలీ చమురు’ పరుగులు!
విజయవాడ కేంద్రంగా ఒడిశా బ్రోకర్ చక్రం.. వాట్సాప్‌లోనే సరుకు, రూటు సమన్వయం!
ఆఫీసు లేదు.. డిపో లేదు.. 30 మందితో పక్కా రహదారి నిఘా నెట్‌వర్క్
ముందు పైలట్.. వెనుక ఎస్కార్ట్.. మధ్యలో ట్యాంకర్ల ప్రయాణం
రోజుకు 15–20 ట్యాంకర్లు.. దాదాపు 5 లక్షల లీటర్ల చమురు ప్రవాహం!
ఫిషింగ్ బోట్లు, క్వారీలు, రైస్ మిల్లులు, ప్రైవేట్ బస్సులే ప్రధాన మార్కెట్
ఈ-వే బిల్లులున్నా ఆగని అక్రమాలు.. ప్రభుత్వ ఖజానాకు భారీ గండి
– కొక్కిలో ప్రత్యేక ఇన్వెస్టిగేటివ్ కథనం
ఉమ్మడి గోదావరి జిల్లాల సూర్య బ్యూరో (కాకినాడ)
విజయవాడలో మకాం.. మూలాలు ఒడిశాలో. చేతిలో ఒక్క ఫోన్.. దాని చుట్టూనే మూడు రాష్ట్రాల నుంచి వచ్చే ఆయిల్ ట్యాంకర్ల కదలిక. బయటకు కనిపించే ఆఫీసు లేదు.. డిపో లేదు. కానీ గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ నుంచి సరుకు ఎప్పుడు బయలుదేరాలి.. ఏ రూటులో రావాలి.. ఎక్కడ ఆగాలి.. చివరకు ఎక్కడ దిగాలి అన్న సమాచారం మాత్రం ఎప్పటికప్పుడు చేరుతోంది. ముందు ‘పైలట్’.. వెనుక నిఘా.. మధ్యలో వేల లీటర్ల చమురుతో ట్యాంకర్. విజయవాడ కేంద్రంగా ఈ వ్యవహారాన్ని సమన్వయం చేస్తున్నట్లు సమాచారం ఉన్న ఒడిశాకు చెందిన ఓ కీలక అంతర్రాష్ట్ర మధ్యవర్తి కనుసన్నల్లో ఈ భారీ నెట్‌వర్క్ సాగుతున్నట్లు ‘సూర్య’ క్షేత్రస్థాయి పరిశోధనలో వెలుగులోకి వచ్చింది.
వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే ట్యాంకర్లకు బయటకు కనిపించే ప్రత్యేక కేంద్రం అవసరం లేదు. సరుకు నుంచి రేటు వరకు.. ట్యాంకర్ నుంచి రూటు వరకు వాట్సాప్‌లోనే సమాచారం చేరుతోంది. రాష్ట్రాల సరిహద్దులు దాటిన తర్వాత కూడా ట్యాంకర్ ప్రయాణం ఒంటరిగా సాగడం లేదు. ఏపీ సముద్ర తీర ప్రాంతాల వరకు దాని వెనుక ప్రత్యేక నిఘా వ్యవస్థ పనిచేస్తోంది.
ముందు ‘పైలట్’.. వెనుక నిఘా!
సాధారణ పారిశ్రామిక సరుకు రవాణా అయితే బిల్లులతో ట్యాంకర్ నేరుగా గమ్యస్థానానికి చేరుతుంది. ఇక్కడ మాత్రం ట్యాంకర్‌కు 5 నుంచి 10 కిలోమీటర్ల ముందే ప్రైవేట్ కారు లేదా బైక్ వెళ్తోంది. అదే ‘పైలట్’. మార్గంలో వాణిజ్య పన్నులు (GST), పోలీసు, రవాణా శాఖ తనిఖీలు ఉన్నాయా.. ఎక్కడైనా అధికారులు వాహనాలను ఆపుతున్నారా అన్నది ముందుగానే గమనించి సమాచారం చేరవేస్తోంది.
ట్యాంకర్ వెనుక మరో వాహనం నిఘా వేస్తోంది. ఎవరైనా వెంబడిస్తున్నారా.. ఎక్కడైనా ఆకస్మిక తనిఖీలు మొదలయ్యాయా అన్నది గమనిస్తోంది. రాష్ట్ర సరిహద్దు దాటించడం మొదలు స్థానికంగా సరుకు దిగే ప్రాంతం వరకు ఈ రూట్ క్లియరెన్స్ వ్యవస్థలో సుమారు 30 మంది పనిచేస్తున్నట్లు క్షేత్రస్థాయి సమాచారం.
ముందు తనిఖీలు ఉన్నట్లు సమాచారం అందితే ట్యాంకర్ ప్రయాణం అక్కడితో ఆగిపోతుంది. సమీప దాబా లేదా నిర్మానుష్య ప్రాంతంలో నిలిపేస్తారు. పరిస్థితి సద్దుమణిగిందని పైలట్ నుంచి సమాచారం వచ్చిన తర్వాతే మళ్లీ ముందుకు కదులుతుంది. ట్యాంకర్ గమ్యస్థానం చేరేలోపు రోడ్డుపై ఏం జరుగుతోందో ముందుగానే తెలుసుకునేలా ఈ గొలుసును ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
రోజుకు దాదాపు 5 లక్షల లీటర్లు!
గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ నుంచి నిత్యం 15 నుంచి 20 ట్యాంకర్ల వరకు ఏపీ వైపు కదులుతున్నట్లు క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారం చెబుతోంది. ఒక్కో ట్యాంకర్ సామర్థ్యం సగటున 25 వేల నుంచి 30 వేల లీటర్లు. ఈ లెక్కన రోజుకు దాదాపు 5 లక్షల లీటర్ల చమురు రాష్ట్రంలోకి వస్తోంది.
కాగితాల్లో మాత్రం పేర్లు వేరు. ఇండస్ట్రియల్ సాల్వెంట్స్, బేస్ ఆయిల్, డిస్టిలేట్ ఫ్యూయల్ ఆయిల్, రీ-రిఫైన్డ్ ఆయిల్ పేర్లతో 18 శాతం జీఎస్టీ పరిధిలోని HSN కోడ్లతో బిల్లులు తయారవుతున్నాయి. కానీ ఈ సరుకులో అధిక భాగం చివరకు ప్రత్యామ్నాయ ఇంధనంగా మార్కెట్‌లోకి వెళ్తున్నట్లు ‘సూర్య’ పరిశోధనలో సమాచారం లభించింది.
పెట్రోల్, డీజిల్‌పై ఉండే భారీ పన్నుల పరిధికి బయట పారిశ్రామిక ఉత్పత్తుల పేరుతో సరుకు కదిలించి.. చివరకు ఇంధనంగా విక్రయిస్తే నేరుగా రాష్ట్ర ఆదాయంపైనే దెబ్బ పడుతుంది. రోజుకు లక్షల్లో.. నెలకు కోట్లలో ప్రభుత్వ ఖజానాకు గండి పడుతున్నట్లు ఈ వ్యవహారానికి సంబంధించిన లెక్కలు సూచిస్తున్నాయి.
సముద్ర తీరమే పెద్ద మార్కెట్
ఈ నెట్‌వర్క్‌కు ఏపీ సముద్ర తీర ప్రాంతం కీలక మార్కెట్‌గా మారుతోంది. బంకులో లభించే డీజిల్‌తో పోలిస్తే ఈ చమురు లీటరుకు రూ.15 నుంచి రూ.25 వరకు తక్కువకు వస్తుండటమే ప్రధాన ఆకర్షణ. రోజూ వేల లీటర్ల ఇంధనం అవసరమయ్యే రంగాలే దీని లక్ష్యం.
ఒక్కో మెకనైజ్డ్ ఫిషింగ్ బోటుకు ఒక ట్రిప్పునకు 3 వేల నుంచి 6 వేల లీటర్ల వరకు డీజిల్ అవసరమవుతుంది. సబ్సిడీ డీజిల్ సరిపోని పరిస్థితిని ఆసరాగా చేసుకుని హార్బర్లు, జెట్టీల సమీపంలోని రహస్య ప్రాంతాలకు ట్యాంకర్లు చేరుతున్నాయి. అక్కడి నుంచే బోట్లకు చమురు అందుతున్నట్లు క్షేత్రస్థాయి సమాచారం.
రాళ్ల క్వారీలు, క్రషర్లలో పనిచేసే ఎక్స్‌కవేటర్లు, పొక్లెయిన్లు, టిప్పర్లకు బ్యారెళ్లలో, బల్క్‌గా సరుకు చేరుతోంది. భారీగా ఇంధనం వినియోగించే ఈ యంత్రాలే మరో ప్రధాన మార్కెట్‌గా మారుతున్నాయి.
బాయిలర్లు, జనరేటర్లు నడిపే రైస్ మిల్లులకు కూడా ఈ చమురు చేరుతున్నట్లు సమాచారం. ధాన్యం, బియ్యం రవాణా చేసే లారీలకు హైవే దాబాల వద్ద రాత్రివేళల్లో ఇంధనం పోస్తున్నట్లు క్షేత్రస్థాయిలో సమాచారం లభించింది.
వందల సంఖ్యలో వాహనాలు నడిపే కొన్ని పెద్ద ప్రైవేట్ విద్యాసంస్థల కాంట్రాక్ట్ బస్సులు, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్లు సైతం వ్యయం తగ్గించుకునేందుకు ఈ చమురును బల్క్‌గా కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ట్యాంకర్ రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత ఒకే చోట సరుకు దిగడం లేదు. అవసరాన్ని బట్టి మినీ ట్యాంకర్లు, డ్రమ్ముల ద్వారా వేర్వేరు ప్రాంతాలకు చేరుస్తున్నట్లు సమాచారం.
బిల్లు ఒకచోటికి.. ట్యాంకర్ మరోచోటికి!
ఈ వ్యవహారంలో అసలు మలుపు ఇక్కడే ఉంది. ట్యాంకర్‌కు ఈ-వే బిల్లు ఉంటుంది. ఫాస్టాగ్ ఉంటుంది. సరుకుకు ఇన్‌వాయిస్ ఉంటుంది. కాగితాల వరకు చూస్తే ప్రయాణం సక్రమంగానే కనిపిస్తుంది. కానీ బిల్లులో ఉన్న సరుకే ట్యాంకర్‌లో ఉందా.. బిల్లులో పేర్కొన్న చిరునామాకే అది చేరిందా అన్నది భౌతికంగా తనిఖీ చేస్తేనే అసలు విషయం బయటపడుతుంది.
విశాఖపట్నంలోని ఒక పరిశ్రమకు సరుకు వెళ్తున్నట్లు ఈ-వే బిల్లులో చూపించి.. గమ్యస్థానానికి చేరకముందే ఉమ్మడి గోదావరి జిల్లాల శివార్లలో ట్యాంకర్‌ను నిలిపి సరుకు దింపుతున్నట్లు సమాచారం. నిర్మానుష్య ప్రాంతాలు, పాత లేఅవుట్లను ఇందుకు ఎంచుకుంటున్నారు. రాత్రివేళల్లో పెద్ద ట్యాంకర్ నుంచి మినీ ట్యాంకర్లు, డ్రమ్ముల్లోకి సరుకు మారుతోంది.
మరోవైపు ఆధార్, పాన్ ఆధారంగా కొద్దికాలం కోసం ఏర్పాటైన షెల్, బోగస్ సంస్థల పేర్లతో బిల్లులు సృష్టిస్తున్నారన్న సమాచారం కూడా ఉంది. తనిఖీ లేదా ఆడిట్ జరిగే సమయానికి ఆ సంస్థ కార్యకలాపాలు నిలిచిపోయే పరిస్థితి ఉండటంతో అసలు లావాదేవీ గొలుసును పట్టుకోవడం కష్టమవుతోంది.
రోడ్డుపై ట్యాంకర్‌ను ఆపినా మరో సమస్య ఎదురవుతోంది. లోపల ఉన్నది డీజిలా.. సాల్వెంటా.. మరో పెట్రోలియం ఉత్పత్తా అన్నది అక్కడికక్కడే నిర్ధారించే మొబైల్ టెస్టింగ్ కిట్లు అందుబాటులో లేకపోవడంతో అధికారులు చివరకు కాగితాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈ ఖాళీనే నెట్‌వర్క్ తనకు అనుకూలంగా మార్చుకుంటున్నట్లు క్షేత్రస్థాయి సమాచారం చెబుతోంది.
ఆ రాష్ట్రాల్లో చరిత్ర ఉంది.. అందుకే ఇక్కడ నిఘా పెట్టాలి!
ఇలాంటి అంతర్రాష్ట్ర ఆయిల్ దందాలు, కల్తీ రాకెట్లు కొత్తవేమీ కావు. గతంలో గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వంటి పారిశ్రామిక రాష్ట్రాల్లో వేస్ట్ ఆయిల్ రీ-రిఫైనింగ్ ముసుగులో అక్రమ బయోడీజిల్ తయారీ, పారిశ్రామిక సాల్వెంట్ల దుర్వినియోగం, ముడిచమురు దొంగతనాలకు సంబంధించిన పలు కేసులు దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాల రికార్డుల్లోకెక్కాయి.
అక్కడ అలాంటి అక్రమాలు, లొసుగులు బయటపడిన నేపథ్యం ఉన్నందున ఆయా రాష్ట్రాల పారిశ్రామిక ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే ఆయిల్ ట్యాంకర్లను ప్రత్యేకంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని రవాణా, పారిశ్రామిక వర్గాలు కోరుతున్నాయి.
ఆయిల్ ఏ పేరుతో బయలుదేరింది.. ఏ సంస్థ పేరుతో లోడ్ అయింది.. బిల్లులో గమ్యస్థానం ఎక్కడ.. చివరకు ఎక్కడ దిగింది.. ఎక్కడ వినియోగమైంది అన్నది మూలం నుంచి గమ్యం వరకు పరిశీలిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.
తేలాల్సింది ట్యాంకర్ కాదు.. నెట్‌వర్క్!
రోడ్డుపై ఒక ట్యాంకర్‌ను ఆపడం పెద్ద విషయం కాదు. డ్రైవర్ చేతిలో ఉన్న బిల్లు చూసి వదిలేయడమూ పూర్తి తనిఖీ కాదు. అసలు దర్యాప్తు అక్కడి నుంచే మొదలవ్వాలి.
బిల్లులో ఉన్న సరుకే బండిలో ఉందా.. ఈ-వే బిల్లులో పేర్కొన్న చిరునామాకే చేరిందా.. మధ్యలోనే దారి మళ్లిందా.. చివరకు ఆయిల్ ఎవరి చేతుల్లోకి వెళ్లింది? ఈ అంశాలు తేలితేనే మొత్తం గొలుసు బయటపడుతుంది.
వాణిజ్య పన్నులు, పోలీసు, విజిలెన్స్, పౌరసరఫరాలు, రవాణా శాఖలు విడివిడిగా ట్యాంకర్‌ను తనిఖీ చేసి వదిలేయడంతో అసలు గొలుసు బయటపడదు. సరుకు ఎక్కడ లోడ్ అయింది.. ఇన్‌వాయిస్‌లో ఏముంది.. ఈ-వే బిల్లులో గమ్యస్థానం ఏది.. ట్యాంకర్ ఏ టోల్‌గేట్లను దాటింది.. ఏపీలోకి ఎక్కడ ప్రవేశించింది.. చివరకు ఎక్కడ సరుకు దించింది.. ఎవరు కొనుగోలు చేశారు అన్న మొత్తం ప్రయాణాన్ని వెనక్కి తిప్పి చూస్తేనే అసలు లింకులు బయటపడతాయి.
అన్నింటికంటే కీలకం విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్నట్లు సమాచారం ఉన్న అంతర్రాష్ట్ర మధ్యవర్తి చుట్టూ సాగిన కమ్యూనికేషన్. సంబంధిత దర్యాప్తు సంస్థలు చట్టబద్ధంగా కీలక ఫోన్ నంబరుకు సంబంధించిన కాల్ డేటా, అవసరమైన డిజిటల్ కమ్యూనికేషన్ ఆధారాలను సేకరించి.. వాటిని ట్యాంకర్ల ప్రయాణాలు, ఈ-వే బిల్లులు, బ్యాంకు లావాదేవీలతో సరిపోల్చాలి.
ఈ అక్రమ రవాణాకు సంబంధించి సేకరించిన కీలక నంబర్లు, వాహనాల కదలికలకు సంబంధించిన సమాచారం ‘సూర్య’ వద్ద భద్రంగా ఉంది. సంబంధిత దర్యాప్తు సంస్థలు విచారణ చేపడితే ఆ సమాచారాన్ని పరిశీలించి మొత్తం గొలుసును ఛేదించే అవకాశం ఉంటుంది.