విందుకెళ్లి వస్తుండగా.. విషాదం!
గుర్తుతెలియని వాహనం ఢీకొని భార్యాభర్తలు, కుమారుడు మృతి
గొల్లపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. భార్యా భర్తలతో పాటు వారి ఆరేళ్ల కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. కుమార్తె స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గొల్లపల్లి స్టేజీ సమీపంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్ మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన భార్యాభర్తలు వారి పిల్లలతో ద్విచక్రవాహనంపై చేవెళ్ల మండలం చన్‌వెల్లి గ్రామంలోని బంధువుల ఇంటికి విందుకు వెళ్లారు. అనంతరం స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. గొల్లపల్లి స్టేజీ సమీపంలోని మూలమలుపు వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం వారి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందినట్లు సమాచారం. ప్రమాదంలో చిన్నారి స్వల్ప గాయాలతో బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు, 108 సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పాపకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదానికి కారణమైన వాహనం వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
(చేవెళ్ - మేజర్ న్యూస్)