నిజాంపేట్ మేజర్ న్యూస్ దేవీ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా నిజాంపేట్ గ్రామంలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఐదవ రోజు గురువారం అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ధర్మకర్త కొలన్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఐదవ రోజు మహాలక్ష్మి అలంకారంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త కొలన్ శ్రీనివాసరెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చండీ హోమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయ ప్రధాన అర్చకులు సత్యం పంతులు ఆయనకు అమ్మవారి శేషవస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారి కృపతో నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కొలన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. దేవీ నవరాత్రుల సందర్భంగా భక్తులు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలని తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు సత్యం పంతులు మాట్లాడుతూ దేవీ నవరాత్రుల ఐదవ రోజు కనకదుర్గమ్మ మహాలక్ష్మి అవతారంలో దర్శనమిస్తున్నారని తెలిపారు. మహాలక్ష్మి అమ్మవారిని భక్తితో ఆరాధించడం ద్వారా అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగాలని, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అభివృద్ధి సాధించాలని భక్తులు ప్రార్థిస్తారని పేర్కొన్నారు. నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతిరోజూ ఆలయ సమీపంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ గ్రామ ప్రజలు, భక్తులు, దుర్గామాత మాలధారణ స్వాములు, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారిని దర్శించుకోవడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.