మూడుచింతలపల్లిలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు
శామీర్పేట, మేజర్ న్యూస్: మూడుచింతలపల్లి మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో మెప్మా ఆధ్వర్యంలో శుక్రవారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ జాం రవి అధ్యక్షతన, కమిషనర్ జి.వెంకట గోపాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు.మహిళా సంఘాల సభ్యులు, ఆర్పీలు, ఓబీలు, మెప్మా సిబ్బంది, సాంస్కృతిక కళాకారులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న మహిళలను చైర్మన్ జాం రవి అభినందించి బహుమతులు అందజేశారు. మహిళలు ఐకమత్యంతో ముందుకు సాగుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దోసకాయల లతా వెంకటేష్ , పెద్దిరెడ్డి శ్రీలత వెంకట్ రెడ్డి , కొల్లాస్ రాజు, ఆది అజయ్ కుమార్, ముద్దం పాపిరెడ్డి, మెరుపాటి గోవర్ధన్ రెడ్డి, పులి ప్రభాకర్, గూడ జంగారెడ్డి, నాయకులు ఇర్రి రవీందర్ రెడ్డి, బూరుగు యాదగిరి, భూమేష్ గౌడ్, మెప్మా టీఎంసీ నర్సింహ, శానిటేషన్ ఇన్స్పెక్టర్ మోహన్ సింగ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్ రెడ్డి, గౌతమి, మెప్మా సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు, ఆర్పీలు, ఓబీలు, సాంస్కృతిక కళాకారులు, మున్సిపల్ సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు.