గ్రామాభివృద్ధికి గుర్తింపు.. శ్రీశైలం యాదవ్‌కు ఉత్తమ అవార్డు
బహుజన సాహిత్య అకాడమీ పురస్కారానికి కుమ్మరిగూడ సర్పంచ్ ఎంపిక
నవంబర్ 15న న్యూఢిల్లీలో అవార్డు ప్రదానం
షాబాద్ : గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ, కుమ్మరిగూడ గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు పాటుపడుతున్న సర్పంచ్ పోనమోని శ్రీశైలం యాదవ్‌కు అరుదైన గుర్తింపు లభించింది. బహుజన సాహిత్య అకాడమీ అందించే ఉత్తమ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో సంస్థ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ చేతుల మీదుగా శ్రీశైలం యాదవ్ అవార్డు ఎంపిక ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. గ్రామాభివృద్ధికి చేస్తున్న కృషిని గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. నవంబర్ 15న న్యూఢిల్లీలో నిర్వహించనున్న కార్యక్రమంలో శ్రీశైలం యాదవ్‌కు ఉత్తమ అవార్డును ప్రదానం చేయనున్నట్లు బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కుమ్మరిగూడ ఉపసర్పంచ్ నారమోని భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
షాబాద్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 13):