గూడూరు పురపోరులో కూటమి ఆశీస్సులు ఎవరికి?
గూడూరు,మేజర్ న్యూస్ : గూడూరు మున్సిపల్ చైర్‌పర్సన్ పదవి ఎస్టీ మహిళకు రిజర్వు కావడంతో పట్టణంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రానున్న పురపాలక ఎన్నికల్లో చైర్‌పర్సన్ పీఠాన్ని దక్కించుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాలు సిద్ధం చేస్తుండగా, అధికార కూటమి తరఫున అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపుతారన్న అంశం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో కూడిన కూటమి నుంచి పోటీ చేసేందుకు ముగ్గురు ఆశావహుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల చైర్‌పర్సన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో గూడూరు మున్సిపాలిటీకి ఎస్టీ మహిళ రిజర్వేషన్ కేటాయించారు. ఈ ప్రకటనతో చైర్‌పర్సన్ పదవిపై ఆశలు పెట్టుకున్న పలువురు నాయకుల రాజకీయ అంచనాలు మారిపోయాయి. రిజర్వేషన్ ప్రకటనకు అనుగుణంగా అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కూటమి తరఫున ఎవరికి అవకాశం లభిస్తుందన్న దానిపై చర్చ మొదలైంది.
-పరిశీలనలో ముగ్గురు ఆశావహులు!
గూడూరు మున్సిపాలిటీలో ఇటీవల విలీనమైన గ్రామాల నుంచి ఇద్దరు, గూడూరు పట్టణం నుంచి మరొకరు కలిపి మొత్తం ముగ్గురు ఆశావహుల పేర్లు కూటమి అభ్యర్థిత్వం కోసం పరిశీలనలో ఉన్నట్లు స్థానిక రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. వీరిలో ఒకరు గూడూరు పట్టణానికి చెంది వ్యవసాయ శాఖలో ప్రభుత్వ ఉద్యోగి కాగా, మరొకరు విలీన గ్రామమైన చెన్నూరునుండి శ్రీ ధర్మ రాజుల స్వామి ఆలయ పాలకమండలి సభ్యురాలు, మరొకరు విలీన గ్రామమైన నెలటూరు నుండి పోటీలో ఉన్నట్లు సమాచారం.
అయితే, ఈ ముగ్గురిలో ఎవరికి కూటమి అభ్యర్థిగా అవకాశం లభిస్తుందనే విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆశావహుల పేర్లపై జరుగుతున్న చర్చకు సంబంధించి పార్టీ వర్గాల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
-విలీన గ్రామాల నేతలకు అవకాశం దక్కేనా?
గూడూరు మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలైన చెన్నూరు, నెల్లటూరు ల నుంచి నుంచి ఇద్దరు ఆశావహులు పోటీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటంతో ఈసారి చైర్‌పర్సన్ అభ్యర్థి ఎంపికలో విలీన గ్రామాలకు ప్రాధాన్యం లభిస్తుందా? లేక పట్టణానికి చెందిన అభ్యర్థికి అవకాశం కల్పిస్తారా? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. సామాజిక సమీకరణాలు, స్థానిక పరిచయాలు, పార్టీతో ఉన్న అనుబంధం తదితర అంశాలు అభ్యర్థి ఎంపికలో ప్రాధాన్యం సంతరించుకునే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
-ఎమ్మెల్యే నిర్ణయంపైనే అందరి దృష్టి
గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశిం సునీల్‌కుమార్ అభ్యర్థి ఎంపికలో కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో ఆయన నిర్ణయంపై ఆశావహులు, పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కూటమి తరఫున అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీ అధిష్ఠానం, ఎమ్మెల్యే సునీల్‌కుమార్ మధ్య చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, అభ్యర్థి ఎంపికపై అధికారిక నిర్ణయం ఇంకా వెలువడలేదు. పార్టీ అధిష్ఠానం నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే కూటమి అభ్యర్థి ఎవరన్నది స్పష్టమవుతుంది.