నంద్యాల ఆటోనగర్ సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట- రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్
సూర్య, నంద్యాల బ్యూరో: నంద్యాల పట్టణ సమగ్ర ప్రగతితో పాటు పారిశ్రామిక, వాణిజ్య ప్రాంతాల ఆధునీకరణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. మంగళవారం నంద్యాల ఆటోనగర్ పరిధిలో 'హైబ్రిడ్ యాన్యుటీ మోడల్' (హెచ్.ఏ.ఎమ్) పథకం కింద రూ. 18.00 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు మంత్రి ఫరూక్ ఘనంగా భూమిపూజ చేసి, శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ఫరూక్ మాట్లాడుతూ నంద్యాల ఆటోనగర్‌ను ఆధునిక హంగులతో, వ్యాపార-పారిశ్రామిక వర్గాలకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. నాణ్యమైన అంతర్గత, ప్రధాన తారు/సీసీ రహదారుల నిర్మాణం, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, భద్రత కోసం సెంట్రల్ మీడియన్ల ఏర్పాటు, రాత్రి వేళల్లో రాకపోకలకు ఇబ్బంది లేకుండా అత్యాధునిక సెంట్రల్ స్ట్రీట్ లైటింగ్ (వీధి దీపాలు), పర్యావరణ పరిరక్షణ, ఆహ్లాదం కోసం పార్కుల ఆధునీకరణ, సుందరీకరణ పనులు
చేపట్టనున్నట్లు తెలిపారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ద్వారా పనులు వేగవంతంగా, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో పూర్తవుతాయని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను, కాంట్రాక్టర్లను మంత్రి ఫరూక్ ఆదేశించారు. నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేసి ప్రజలకు, ఆటోనగర్ కార్మికులకు, వ్యాపారులకు అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, ఆటోనగర్ ప్రెసిడెంట్ జాకీర్ , పబ్బతి వేణు, ఉడుమాల్పురం కళ్యాణ్, లోకేష్, గఫార్ ,
నంద్యాల మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, ఆటోనగర్ అసోసియేషన్ ప్రతినిధులు, ప్రముఖులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*