నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో మెగా రక్తదాన శిబిరం
గూడూరు, మేజర్ న్యూస్ : గూడూరులోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో 2026 అక్టోబర్ 13వ తేదీన కళాశాల సెంటర్ ఫర్ ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ (CEA), ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో నెల్లూరులోని నారాయణ మెడికల్ కళాశాల సహకారంతో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అత్యవసర సమయాల్లో రక్తం అందక ఏ ఒక్కరి ప్రాణం పోకూడదనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా రక్తదానం యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు, అధ్యాపకులకు, కళాశాల సిబ్బందికి వివరించారు.
ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ కె. విశ్వక్సేన రెడ్డి మాట్లాడుతూ, రక్తదానం అనేది అత్యంత గొప్ప మానవతా సేవ అని పేర్కొన్నారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ వైద్యుల సూచనల మేరకు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మనం చేసే ఒక్కసారి రక్తదానం అవసరమైన వారికి ప్రాణదానంగా మారుతుందని, రక్తదానం పట్ల సమాజంలో ఉన్న అపోహలను తొలగించి యువతలో సేవాభావాన్ని పెంపొందించాలని అన్నారు. విద్యార్థులు విద్యతో పాటు సామాజిక బాధ్యతను కూడా అలవర్చుకోవాలని సూచించారు.
కళాశాల అడ్వైజర్ డాక్టర్ ఏ.వి.ఎస్. ప్రసాద్, డీన్ డాక్టర్ జి. శ్రీనివాసులు రెడ్డి తదితరులు మాట్లాడుతూ, సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలను నిర్వహించడం నారాయణ విద్యాసంస్థల ప్రధాన లక్ష్యాలలో ఒకటని తెలిపారు. యువత రక్తదానంపై అవగాహన పెంపొందించుకుని . రక్తదానం వల్ల ఇతరుల ప్రాణాలను కాపాడటమే కాకుండా సమాజంలో మానవత్వం, సహకారం, సేవాభావం పెరుగుతాయని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలను కళాశాలలో నిరంతరం నిర్వహిస్తూ విద్యార్థులను సామాజిక సేవలో భాగస్వాములను చేయడానికి యాజమాన్యం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని తెలిపారు.
ఎన్ఎస్ఎస్ కన్వీనర్ ఎన్. కోటేశ్వరరావు మాట్లాడుతూ ఈ మెగా రక్తదాన శిబిరం ద్వారా స్వచ్ఛంద రక్తదానం ప్రాముఖ్యతను విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు, అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైన వారికి సహాయం చేయాలనే సందేశాన్ని అందించారు. “ప్రతి రక్తదాత ఒక ప్రాణరక్షకుడు” అనే నినాదానికి అనుగుణంగా రక్తదానంపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన దాతలను అభినందించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ డి. రాజేష్ రెడ్డి,అధ్యాపకులు, విద్యార్థులు మరియు ఎ ఓ కొండారెడ్డి ,అధ్యాపకేతర సిబ్బంది , ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.