జగన్మాత దివ్యదర్శనంతో పులకించిన దర్శకుడు బోయపాటి శ్రీను
ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను మంగళవారం ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మను భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకుని ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. ఈ సందర్భంగా దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా గాంధీ ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం మీడియా పాయింట్‌లో బోయపాటి శ్రీను మాట్లాడుతూ, గతంలో దసరా పండుగ అనగానే మైసూర్ గుర్తుకు వచ్చేదని తెలిపారు. ప్రస్తుతం విజయవాడలో కూడా అదే స్థాయిలో విజయవాడ ఉత్సవ్, సరస్ బజార్ వంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా విజయవాడ ఖ్యాతి దేశవ్యాప్తంగా విస్తరిస్తోందని పేర్కొన్నారు. శరన్నవరాత్రుల పవిత్ర వేళ జగన్మాతను దర్శించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.