ఏడవకపోతే రూ. కోటి.. ఏడిస్తే రూ. లక్ష.. అల్లు అరవింద్‌తో ఖరీదైన బెట్ ఓడిపోయిన సుకుమార్
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: స్టార్ డైరెక్టర్ సుకుమార్, అగ్ర నిర్మాత అల్లు అరవింద్ మధ్య జరిగిన ఓ ఆసక్తికర పందెం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి ప్రధాన పాత్రల్లో నటించిన ఆకాశంలో ఒక తార సినిమా విషయంలో వీరిద్దరి మధ్య ఈ సరదా ఛాలెంజ్ నడిచింది. ఈ పందెంలో ఓడిపోయిన సుకుమార్ ఏకంగా రూ. లక్ష చెక్‌ను అల్లు అరవింద్ పేరిట రాసిచ్చి సోషల్ మీడియా వేదికగా ఆ వివరాలను పంచుకున్నారు.
సినిమా విడుదలైన తర్వాత అల్లు అరవింద్ తనకు ఫోన్ చేసి ఓ సవాల్ విసిరారని సుకుమార్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడించారు. ఆకాశంలో ఒక తార సినిమాను థియేటర్‌లో చూసి కన్నీళ్లు పెట్టుకోకుండా బయటకు వస్తే రూ. కోటి ఇస్తానని, ఒకవేళ భావోద్వేగానికి లోనై కంటతడి పెడితే మాత్రం తనకు రూ. లక్ష ఇవ్వాల్సి ఉంటుందని అల్లు అరవింద్ పందెం కాసినట్లు సుకుమార్ పేర్కొన్నారు. సినిమా చూస్తున్నంత సేపు కథలోని భావోద్వేగాలకు కదిలిపోయి కన్నీళ్లు ఆపుకోలేకపోయానని సుకుమార్ తెలిపారు.
పందెం ప్రకారం ఓడిపోవడంతో శ్రీ అరవింద్ గారి పేరు మీద రూ. లక్ష రూపాయల చెక్ రాసి ఆ ఫొటోను సుకుమార్ షేర్ చేశారు. ఇంత ఖరీదైన సిఫార్సు అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తూ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. సుకుమార్ వంటి అగ్ర దర్శకుడు స్వయంగా స్పందించడంతో ఈ పోస్ట్ నెట్టింట వేగంగా వైరల్ అవుతూ సినిమాకు మరింత ప్రచారాన్ని తెచ్చిపెడుతోంది.
పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఆకాశంలో ఒక తార చిత్రం నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. గీతా ఆర్ట్స్ సమర్పణలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ కీలక పాత్ర పోషించారు. వ్యోమగామి కావాలని కలలు కనే ఓ గ్రామీణ యువతి ప్రయాణం నేపథ్యంలో సాగే ఈ భావోద్వేగభరిత కథనం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది.
Also Read: వృషకర్మ వర్సెస్ అలియాస్ రుక్మిణి.. డిసెంబర్ 4 బాక్సాఫీస్ పోరులో గెలిచేదెవరు