బాలికలకు హెచ్‌పీవీ టీకాతో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు అడ్డుకట్ట
- చింతకుంట పీహెచ్‌సీ లో హెచ్ పి వి ప్రత్యేక టీకా కార్యక్రమం.
- ప్రభుత్వ వైద్యాధికారిణి డాక్టర్ వికసిత
దువ్వూరు, మేజర్ న్యూస్ :
హెచ్‌పీవీ (హెచ్ పి వి ) వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా చింతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ వికసిత ఆధ్వర్యంలో చిన్న సింగనపల్లె గ్రామంలోని 14 సంవత్సరాలు నిండిన, 15 సంవత్సరాల లోపు వయస్సు గల విద్యార్థినులకు చింతకుంట ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం హెచ్‌పీవీ టీకాలు అందించారు. ఈ సందర్భంగా వైద్యాధికారిణి డాక్టర్ వికసిత మాట్లాడుతూ మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించడంలో హెచ్‌పీవీ టీకా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ వ్యాధి వల్ల అనేకమంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో, వ్యాధి నివారణపై ముందస్తు అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు, మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ వైద్యశాలల్లో ఉచితంగా హెచ్‌పీవీ టీకా అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు.హెచ్‌పీవీ టీకా భారతదేశంలో 2008 నుంచి అందుబాటులో ఉందని, గతంలో ప్రైవేటు వైద్యరంగంలో ఈ టీకా తీసుకోవడానికి అధిక ఖర్చు అయ్యేదని తెలిపారు. టీకా భద్రత, ప్రయోజనాలపై సరైన సమాచారం తెలుసుకోవాలని, అపోహల కారణంగా తమ పిల్లలకు టీకా వేయించకుండా నిర్ణయం తీసుకోవడం సరికాదని తల్లిదండ్రులకు సూచించారు. టీకా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, సంభవించే సాధారణ దుష్ప్రభావాలు, టీకా అనంతర జాగ్రత్తల గురించి వైద్య సిబ్బందిని సంప్రదించి తెలుసుకోవాలని కోరారు.
నేటి బాలికల ఆరోగ్యమే రేపటి ఆరోగ్యవంతమైన మహిళా సమాజానికి పునాది అని డాక్టర్ వికసిత పేర్కొన్నారు. బాలికల ఆరోగ్య పరిరక్షణలో తల్లిదండ్రుల బాధ్యత ఎంతో ముఖ్యమని, అర్హత కలిగిన తమ పిల్లలకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం హెచ్‌పీవీ టీకా వేయించి, భవిష్యత్తులో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముప్పును తగ్గించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి రాజగోపాల్, ఆరోగ్య పర్యవేక్షకులు శివ, గంగరాజు, చిన్న సింగన పల్లె సిహెచ్ఓ హరిచందన,ఏఎన్‌ఎం చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: బొర్రా శివరామిరెడ్డి, మైదుకూరు ఇన్ చార్జ్ కడప జిల్లా