రేలంగిలో 2,840 పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ
తణుకు,సూర్య న్యూస్ :రైతుల భూములపై వారి హక్కులకు భరోసా కల్పించడంతో పాటు భూ రికార్డుల నిర్వహణలో పారదర్శకత తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ స్పష్టం చేశారు. మంగళవారం ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో రైతులకు 2,840 రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తరతరాలుగా వారసత్వంగా సంక్రమించిన భూములు రైతులకు జీవనాధారమని, అటువంటి భూములకు సంబంధించిన అధికారిక పత్రాలపై రాజకీయ నాయకుల చిత్రాలు ఉండటం సమంజసం కాదన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పట్టాదారు పాస్‌పుస్తకాలపై అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి చిత్రాలను ముద్రించి రాజకీయ ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చిందని విమర్శించారు. రైతుల ఆస్తులకు సంబంధించిన పత్రాలపై వ్యక్తుల చిత్రాలకు బదులుగా ప్రభుత్వ అధికారిక రాజముద్ర ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఎన్నికల హామీని అమలు చేస్తున్నట్లు తెలిపారు.భూ వివాదాలకు ఆస్కారం లేకుండా చర్యలు..…గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై రైతుల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేసిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతుల భూములకు సంబంధించిన హక్కులు, రికార్డుల విషయంలో ఎలాంటి అపోహలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నూతన పాస్‌పుస్తకాల్లో రాజముద్రతో పాటు రైతు ఫొటో, భూమి వివరాలు, మ్యాప్ పొందుపరుస్తున్నట్లు వివరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మొబైల్ ఫోన్ ద్వారా భూమి ఉన్న ప్రాంతాన్ని గుర్తించే సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు.గత ప్రభుత్వ హయాంలో పట్టాదారు పాస్‌పుస్తకాలతో పాటు పొలాల సరిహద్దు రాళ్లపై కూడా రాజకీయ నాయకుల చిత్రాలను ఏర్పాటు చేయడాన్ని ఎమ్మెల్యే తప్పుబట్టారు. ప్రజాధనాన్ని వ్యక్తిగత ప్రచారానికి వినియోగించారని ఆరోపించారు. రైతులకు ఉపయోగపడే సంస్కరణలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.2027 నాటికి ప్రతి రైతుకూ పాస్‌పుస్తకం..…రాష్ట్రవ్యాప్తంగా 2027 నాటికి ప్రతి రైతుకూ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌పుస్తకాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతినెలా 9వ తేదీన చేపడుతున్న ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా పాస్‌పుస్తకాల పంపిణీ కొనసాగుతోందన్నారు. తణుకు నియోజకవర్గంలోనూ పాస్‌పుస్తకాలు సిద్ధమైన గ్రామాల్లో నేరుగా రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు.భూముల సరిహద్దుల గుర్తింపు, రికార్డుల సవరణ, రైతుల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ, రైతాంగ ప్రయోజనాల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. భూ పరిపాలనలో పారదర్శకత పెంచడంతో పాటు రైతులు తమ భూములకు సంబంధించిన వివరాలను సులభంగా తెలుసుకునే వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తున్నామని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
రిపోర్టర్.:అనుకుమార్.తణుకు. .పశ్చిమగోదావరి జిల్లా.