మూడు గ్రామాల్లో పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
తణుకు, సూర్య న్యూస్ : పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపులో గతంలో జరిగిన లోపాలను సరిదిద్ది, అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ స్పష్టం చేశారు. మంగళవారం తణుకు మండలం మహాలక్ష్మి చెరువు, ఇరగవరం మండలం రేలంగి, కొత్తపాడు గ్రామాల్లో మొత్తం 169 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. మహాలక్ష్మి చెరువులో 112 మందికి, రేలంగిలో 17 మందికి, కొత్తపాడులో 40 మందికి పట్టాలు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఇంటి స్థలాల కేటాయింపులు జరిగినప్పటికీ, పట్టాలకు సంబంధించిన ప్రక్రియ పూర్తికాక పలువురు లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. అలాంటి సమస్యలను పరిష్కరించి అర్హులకు అధికారిక పట్టాలు అందించడం ద్వారా వారి హక్కులకు భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో గృహ నిర్మాణ అనుమతులు, బ్యాంకు రుణాల కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత రికార్డులు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.పేదలకు ఇళ్ల పట్టాలు అందిస్తుంటే వైసీపీ నాయకులు ‘చెల్లికి మళ్లీ పెళ్లి’ అంటూ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో అనేక మంది మహిళలు, పేద కుటుంబాలు ఇళ్ల స్థలాల సమస్యలతో ఇబ్బందులు పడ్డాయని ఆరోపించారు. అలాంటి కుటుంబాలకు న్యాయం చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుంటే రాజకీయ విమర్శలు చేయడం సరికాదన్నారు. పేదల జీవితాల్లో భరోసా నింపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.కాలనీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు...…గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, వీధి దీపాలు, విద్యుత్ స్తంభాలు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామని ఎమ్మెల్యే తెలిపారు. గతంలో పంచాయతీ కార్యాలయం, డ్వాక్రా భవనం నిర్మాణంతో పాటు రహదారుల అభివృద్ధికి కృషి చేశామని గుర్తుచేశారు. ప్రస్తుతం కొన్ని కాలనీల్లో రహదారులు దెబ్బతిన్న విషయం తన దృష్టికి వచ్చిందని, వాటి మరమ్మతులు, అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వేల్పూరు నుంచి కాలనీ వరకు రాత్రివేళ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా వీధి దీపాలు, అవసరమైన ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయిస్తామన్నారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నిధుల సమీకరణలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా చేపడతామని తెలిపారు. ఇంటి స్థలాలు, పట్టాలకు సంబంధించి ఇంకా పరిష్కారం కాని సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గ్రామాల సమగ్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు...
రిపోర్టర్:.అనుకుమార్. తణుకు.పశ్చిమగోదావరి జిల్లా.