రైతాంగ వ్యతిరేక విధానాలపై పోరాటం..* *కేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీల అమలు చేయాలి..* *మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకురావాలి.
ఏలూరు సూర్య న్యూస్: కేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని, మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకురావాలని రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు,కార్మిక సంఘాల జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ఏలూరు,సిఐటియు జిల్లా కార్యాలయంలో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్.కె.ఎం) జిల్లా సమావేశం ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు పోరండ్ల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్, బి కే ఎం యు జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహన్ రావు, ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కారం రాఘవ,సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్. లింగరాజు, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడారు. రైతాంగ సమస్యలు పరిష్కారం కోసం దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా నవంబర్ 26 నుండి విజయవాడలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 10 రోజులు పాటు నిరవధిక రైతాంగ దీక్షలు జరుగుతున్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా 100 కేంద్రాల్లో కేంద్ర మోడీ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలపై రైతు ఉద్యమం జరుగుతుందన్నారు. ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా మోడీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మద్దతు ధరలు గ్యారెంటీ చట్టం తీసుకురావాలని కోరారు. దేశవ్యాప్తంగా ఒకే దఫాలో రైతుల రుణాలు మాఫీ చేయాలన్నారు. కరువు ప్రాంతాల్లో కరువు సహాయక చర్యలు చేపట్టాలని, నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని, ఉపాధి హామీ పనులు కల్పించాలని కోరారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఉత్పత్తి ఖర్చులకు అదనంగా 50% కలిపి మద్దతు ధరలు నిర్ణయించాల్సి ఉన్నా ప్రస్తుత మద్దతు ధరలతో రైతులకు పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదన్నారు. వినియోగదారులకు మాత్రం ధరలు మండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, దళారీ వ్యవస్థను అరికట్టి ప్రభుత్వమే రైతుల పంటలను కొనుగోలు చేయాలన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో తలెత్తిన వివాదాల నేపథ్యంలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని,ఎస్ఐఆర్ పేరుతో తొలగించిన 13 కోట్ల మంది ఓట్లను వెంటనే పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. నవంబర్ 26 నుండి జరుగుతున్న రైతాంగ దీక్షలు విజయవంతం కోరుతూ జిల్లాలో అన్ని మండలాల్లో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశం నిర్ణయించిందని చెప్పారు.ఈ సమావేశంలో సిఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి ఎన్ వి డి ప్రసాద్, సహాయ కార్యదర్శి కె.శ్రీనివాసరావు, ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఎం. కృష్ణ చైతన్య, ఏఐకేఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్.నాగరాజు, ఏఐకేఎంఎస్ జిల్లా సహాయ కార్యదర్శి ఈబిచర్ల భూషణం, పి.డి.ఎస్.యు జిల్లా కార్యదర్శి బి.వినోద్ కుమార్, పి.వై.ఎల్ జిల్లా కన్వీనర్ టి.బాబూరావు, పౌర హక్కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె.మంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పసుమర్తి రాము జిల్లా ఇంచార్జ్ ఏలూరు