ఫేస్‌బుక్‌లో ఆన్‌లైన్ గేమింగ్ పెట్టుబడుల పేరుతో సైబర్ మోసం.. ముగ్గురు నిందితుల అరెస్ట్: ఎస్పీ స్నేహ మెహ్రా
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (అక్టోబర్ 13):
సోషల్ మీడియాలో ఆన్‌లైన్ గేమింగ్, పెట్టుబడుల పేరుతో అధిక లాభాలు వస్తాయంటూ చేసే ప్రకటనలను నమ్మి డబ్బులు పంపవద్దని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ప్రజలకు సూచించారు. ‘కళ్యాణ్ మార్నింగ్’, ‘మిలన్ మార్నింగ్’, ‘శ్రీదేవి’ పేర్లతో నకిలీ విజేతల వీడియోలు, మనీ వోచర్లు సృష్టించి ప్రజలను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ తరహా మోసానికి సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, కారు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.కుల్కచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గట్టనపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో ఆన్‌లైన్ గేమింగ్, పెట్టుబడులకు సంబంధించిన ప్రకటన చూసి సైబర్ మోసానికి గురయ్యాడు. ఈ ఘటనపై కుల్కచర్ల పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 35/2026గా కేసు నమోదైంది. బాధితుడు ఫేస్‌బుక్‌లో ‘కళ్యాణ్ మార్నింగ్’ పేరుతో ఉన్న ప్రకటనను చూసి, అందులో పేర్కొన్న మొబైల్ నంబర్ ద్వారా సంబంధిత వ్యక్తులను సంప్రదించాడు. మొదట కొంత మొత్తం పెట్టుబడిగా పంపితే ఆదాయం వస్తుందని నమ్మించిన నిందితులు, ఆ తర్వాత ప్రాసెసింగ్ ఫీజు పేరుతో డబ్బులు వసూలు చేశారు.అనంతరం ‘కళ్యాణ్ మార్నింగ్’, ‘మిలన్ మార్నింగ్’, ‘శ్రీదేవి’ పేర్లతో గెలుపొందినట్లు చూపించే నకిలీ మనీ వోచర్లను బాధితుడికి పంపించారు. సుమారు రూ.2.65 లక్షలు గెలుచుకున్నట్లు నమ్మించి, ఆ మొత్తాన్ని విడుదల చేయాలంటే సర్వీస్ ఛార్జీలు, జీఎస్టీ, ఇతర పన్నులు చెల్లించాలని చెప్పి విడతలవారీగా డబ్బులు వసూలు చేశారు. ఈ విధంగా బాధితుడి నుంచి పలు ఆన్‌లైన్ లావాదేవీల ద్వారా మొత్తం రూ.1,58,300 బదిలీ చేయించుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930ను సంప్రదించడంతో పాటు కుల్కచర్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఏడాది మార్చి 3న ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సాంకేతిక ఆధారాలతో నిందితుల గుర్తింపు
దర్యాప్తులో భాగంగా నిందితులు సోషల్ మీడియా వేదికలు, గేమింగ్ అప్లికేషన్ల ద్వారా ఆకర్షణీయమైన ప్రకటనలు, నకిలీ విజేతల వీడియోలు, డబ్బులు గెలుచుకున్నట్లు చూపించే వోచర్లను ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధితులు గెలుచుకున్న మొత్తాన్ని పొందాలంటే ముందుగా ప్రాసెసింగ్ ఫీజు, సర్వీస్ ఛార్జీలు, జీఎస్టీ తదితర పేర్లతో డబ్బులు చెల్లించాలని చెప్పి మోసాలకు పాల్పడినట్లు వెల్లడైంది. బాధితుల నుంచి సేకరించిన డబ్బులను వివిధ బ్యాంకు ఖాతాలు, ఆన్‌లైన్ పేమెంట్ స్కానర్ల ద్వారా బదిలీ చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు.
కామారెడ్డి బస్‌స్టాండ్ వద్ద ముగ్గురి అరెస్ట్
జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ బల్వంత్ రాయ్ తన సిబ్బందితో కలిసి విశ్వసనీయ సమాచారం ఆధారంగా కామారెడ్డి పట్టణ బస్‌స్టాండ్ ప్రాంతంలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి తెల్లరంగు మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ కారు, పలు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో గతంలోనూ కొందరు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన నిందితుల కోసం దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ బల్వంత్ రాయ్, ఆయన బృందం బ్యాంకు లావాదేవీలు, సాంకేతిక ఆధారాలు, డిజిటల్ సమాచారాన్ని విశ్లేషిస్తూ నిందితుల పాత్రను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఆశ చూపిస్తూ సైబర్ నేరగాళ్లు ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు. అపరిచిత వ్యక్తులు సోషల్ మీడియాలో చేసే పెట్టుబడి ప్రకటనలను నమ్మవద్దని, డబ్బులు గెలుచుకున్నట్లు చూపించే వీడియోలు, వోచర్లను చూసి మోసపోవద్దని సూచించారు. బహుమతులు లేదా గెలుచుకున్న మొత్తాన్ని విడుదల చేయడానికి ముందుగా డబ్బులు చెల్లించాలని కోరితే అప్రమత్తం కావాలని పేర్కొన్నారు.అనుమానాస్పద ఆన్‌లైన్ లావాదేవీలకు దూరంగా ఉండాలని, సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌ను సంప్రదించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇలాంటి మోసాలపై కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీ కోరారు.