సింగరేణి కార్మికులకు లాభాల్లో 34 శాతం వాటా.. కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 బోనస్ 15 రోజుల్లో పెండింగ్ వారసత్వ ఉద్యోగాల సమస్య పరిష్కారానికి చర్యలు..
సూర్య పెద్దపల్లి ప్రతినిధి ; సింగరేణి కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. సింగరేణి సంస్థ సాధించిన రూ.1,754 కోట్ల లాభాల నేపథ్యంలో కార్మికులకు 34 శాతం వాటా ప్రకటించడంతో పాటు కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 బోనస్ అందించనున్నట్లు పేర్కొన్నారు.తెలంగాణ ప్రజా భవన్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సింగరేణి పరివాహక ప్రాంత ఎమ్మెల్యేలు, సింగరేణి యాజమాన్య ప్రతినిధులతో కలిసి విజయరమణారావు పాల్గొన్నారు.కార్మికుల దీర్ఘకాలిక ఆకాంక్ష అయిన సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సమావేశంలో వెల్లడించారు. అలాగే విజిలెన్స్ విచారణలు, పెండింగ్ కేసుల కారణంగా నిలిచిపోయిన వారసత్వ ఉద్యోగాల సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, 15 రోజుల్లో ఉద్యోగాల కల్పన ప్రక్రియను ముందుకు తీసుకెళ్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు.ఇప్పటికే ఒక్కో ఉద్యోగికి రూ.1,10,250 చొప్పున దసరా బోనస్ ప్రకటించిన నేపథ్యంలో, లాభాల వాటా, కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్, సొంతింటి హామీ, పెండింగ్ ఉద్యోగాల సమస్య పరిష్కారానికి చర్యలు సింగరేణి కార్మిక కుటుంబాల్లో ఆశలు నింపుతున్నాయి.