అద్దంకిలో విశ్రాంత ఉద్యోగుల సంఘం 42వ ఆవిర్భావ దినోత్సవం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని అద్దంకిలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక విశ్రాంత ఉద్యోగుల భవనంలో అద్దంకి యూనిట్ అధ్యక్షులు నర్రా గోపాలరావు సంఘం జెండాను ఆవిష్కరించి, నకారా విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు నర్రా గోపాలరావు, అసోసియేట్ అధ్యక్షులు సర్వేశ్వరరావు మాట్లాడుతూ, విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సంఘం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. సభ్యులు తమ సమస్యలను సంఘం దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కోశాధికారి వారణాసి రఘురామశర్మ, కార్యదర్శి నిమ్మరాజు నాగేశ్వరరావు, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు మక్కిన వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి పి. బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం చివరలో సూపర్ సీనియర్ పెన్షనర్ కందికంటి సత్యనారాయణను ఘనంగా సన్మానించారు.