చెత్తతో నిండిన ఉందానగర్ రైల్వే స్టేషన్ పరిసరాలు
జీహెచ్ఎంసీ శంషాబాద్ 118వ డివిజన్ పరిధిలోని ఉందానగర్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు చెత్తాచెదారంతో నిండిపోయి అపరిశుభ్రంగా మారాయి. పారిశుధ్య నిర్వహణ పూర్తిగా లోపించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రైల్వే స్టేషన్ కు వెళ్లే దారి వెంబడి, ప్లాట్ ఫాం పరిసరాల్లో ఎక్కడ చూసినా చెత్త కుప్పలు పేరుకుపోయాయి. చెత్త కుప్పల నుండి దుర్వాసన వెదజల్లుతుండటంతో పాటు దోమలు, ఈగలు వ్యాపించి అపరిశుభ్ర వాతావరణం నెలకొందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిత్యం వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే రైల్వే స్టేషన్ వద్ద ఇలాంటి పరిస్థితి ఉండటం బాధాకరమని, పారిశుధ్యం లోపం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి, పేరుకుపోయిన చెత్తను తొలగించి పారిశుధ్య చర్యలు చేపట్టాలని, రోజువారీ చెత్త సేకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.
- మేజర్ న్యూస్ శంషాబాద్….