అంత్యక్రియలకు వెళ్తూ అనంతగిరి ఘాట్‌లో ఘోర ప్రమాదం
బ్రేక్ ఫెయిల్‌తో బస్సు బోల్తా.. నలుగురు మృతి
మరో నలుగురి పరిస్థితి విషమం.. పలువురికి తీవ్ర గాయాలు
బస్సులో సుమారు 40 మంది.. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ, కలెక్టర్
వికారాబాద్/ధారూర్, మేజర్ న్యూస్( అక్టోబర్ 3):బంధువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళ్తున్న వారిని అనంతగిరి ఘాట్ రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదంలోకి నెట్టింది. వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డులో శనివారం ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరికొందరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 40 మంది ఉన్నట్లు తెలుస్తోంది.
బ్రేక్ ఫెయిల్‌తోనే ప్రమాదం
బస్సుకు బ్రేక్ ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగినట్లు వికారాబాద్ డీఎస్పీ అంజయ్య తెలిపారు. అనంతగిరి ఘాట్ రోడ్డులోని ప్రమాదకర మలుపు వద్ద బ్రేక్‌లు పనిచేయకపోవడంతో డ్రైవర్ బస్సును నియంత్రించలేకపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
అంత్యక్రియలకు వెళ్తుండగా విషాదం
సంగారెడ్డి జిల్లా ఓడీఎఫ్ క్యాసారం ప్రాంతానికి చెందిన కొందరు ఇస్నాపూర్‌లో వెల్డింగ్ పని చేస్తూ శుక్రవారం అకస్మాత్తుగా మృతి చెందిన కొత్తగడి నారాయణరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బయలుదేరారు. నారాయణరెడ్డి స్వగ్రామం వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం చింతకుంట కావడంతో బంధువులు, కుటుంబ సభ్యులు కలిసి ప్రైవేట్ బస్సులో చింతకుంటకు బయలుదేరారు.బస్సు వికారాబాద్ దాటి ధారూర్ వైపు వెళ్తుండగా అనంతగిరి ఘాట్ రోడ్డులోని ప్రమాదకర మలుపు వద్దకు చేరుకుంది. అదే సమయంలో బ్రేక్ ఫెయిల్ కావడంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికుల సహాయంతో క్షతగాత్రుల తరలింపు
ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికుల ఆర్తనాదాలతో ఘాట్ రోడ్డు ప్రాంతం విషాదభరితంగా మారింది. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.విషయం తెలుసుకున్న వెంటనే వికారాబాద్ డీఎస్పీ అంజయ్య, వికారాబాద్ టౌన్ సీఐ రఘుకుమార్, ధారూర్ సీఐ రఘురాములు తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో బస్సులో చిక్కుకున్న మృతులను, క్షతగాత్రులను బయటకు తీశారు. క్షతగాత్రులను వెంటనే వికారాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఎస్పీ, కలెక్టర్ పరిశీలన
ప్రమాద సమాచారం తెలుసుకున్న వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద పరిస్థితులు, సహాయక చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
చింతకుంట, క్యాసారంలో విషాదఛాయలు
అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బయలుదేరిన బంధువుల బస్సు ప్రమాదానికి గురికావడంతో చింతకుంట గ్రామంతో పాటు క్యాసారం ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సులో ప్రయాణించిన వారి పూర్తి వివరాలు, మృతులు, క్షతగాత్రుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు వచ్చిన తర్వాత పూర్తి కథనం మళ్లీ అందిస్తాం.
రిపోర్టర్లు సుధాకర్/అశోక్.