telanagana
చెరువుల కాలుష్యానికి అడ్డుకట్ట వేయాలి: ఆకుల సతీష్
నిజాంపేట్ మేజర్ న్యూస్ దూలపల్లి, ప్రగతినగర్ చెరువుల్లోకి మురుగునీరు చేరకుండా తక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు, నిరుపయోగంగా మారి ప్రమాదకరంగా ఉన్న వాటర్ ట్యాంక్‌ను తొలగించాలని కోరుతూ ఆకుల సతీష్ స్థానిక ప్రజలతో కలిసి హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్‌కు గురువారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సమస్యలకు సంబంధించిన ఆధారాలను అధికారులకు అందజేసి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. కొంపల్లి సర్కిల్ పరిధిలోని దూలపల్లిలో ఉన్న సుమర్ చెరువు, లింగోయ్ కుంటలోకి సమీపంలోని విద్యాసంస్థల నుంచి మురుగునీరు చేరుతుండటంతో చెరువులు కలుషితమవుతున్నాయని స్థానికులు ఫిర్యాదులో పేర్కొన్నారు. మురుగునీటి ప్రవాహాన్ని వెంటనే అరికట్టి, చెరువులను శుద్ధి చేసి పునరుద్ధరించాలని కోరారు. చెరువుల పరిసరాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు భవిష్యత్తులో ఆక్రమణలు జరగకుండా పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని ప్రగతినగర్ సాయి కీర్తి లేఔట్లో సుమారు 30 ఏళ్ల క్రితం నిర్మించిన వాటర్ ట్యాంక్ ప్రస్తుతం నిరుపయోగంగా ఉందని, దానికి పగుళ్లు ఏర్పడి ప్రమాదకరంగా మారిందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ట్యాంక్ ఎప్పుడు కూలిపోతుందోననే ఆందోళన స్థానికుల్లో నెలకొందని తెలిపారు. ఏదైనా ప్రమాదం జరిగి ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకముందే సంబంధిత అధికారులు స్పందించి ట్యాంక్‌ను తొలగించాలని కోరారు. అలాగే అక్కడి పార్కును ప్రజలు ఎలాంటి భయాందోళనలు లేకుండా వినియోగించుకునేలా తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ రెండు సమస్యలపై స్పందించిన హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ క్షేత్రస్థాయి నివేదికలను తెప్పించి, సమస్యల తీవ్రతను పరిశీలించిన అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఫిర్యాదుదారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకుల సతీష్‌తో పాటు రామకృష్ణ రెడ్డి, అశ్విన్, ఆర్కె భీమ్ రావు, వెంకట్రావు, వీర రెడ్డి, నూఖా రాజు, ఈశ్వర రెడ్డి, సాయినాథ్ రెడ్డి, రాజా రెడ్డి, దుర్గా, గుర్రాల రమేష్, చింతల నరసింహ, దుర్గం చంద్రశేఖర్, పీఆర్ సాయిరాం, గరిష అశ్విన్, జి. చుకయ్య, పూజారి మహేష్ తదితరులు పాల్గొన్నారు.