ఆలయ పునర్నిర్మాణం, పుష్కర ఘాట్ల పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలి
సూర్య ధర్మపురి:ధర్మపురి పట్టణంలోని ఉగ్ర నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు, రానున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని నిర్మిస్తున్న పుష్కర ఘాట్ల పనులను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని కొనసాగుతున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటిస్తూ, నిర్ణీత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం గోదావరి నది పరివాహక ప్రాంతంలో నిర్మిస్తున్న పుష్కర ఘాట్ల పనులను పరిశీలించారు.2027 గోదావరి పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని సూచించారు.
పుష్కర ఘాట్ల నిర్మాణ పనులను వేగవంతం చేయడంతో పాటు నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు.
భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, రహదారులు, రాకపోకలు, ఇతర మౌలిక వసతులను సమగ్రంగా ఏర్పాటు చేయాలని సూచించారు.
పుష్కరాల సమయంలో భక్తుల రద్దీకి అనుగుణంగా ఘాట్ల వద్ద అవసరమైన సౌకర్యాలు, భద్రతా చర్యలను ముందుగానే ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని తెలిపారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని, నిర్దేశించిన గడువులోగా పుష్కరాల ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీఓ పి. మధుసూదన్, మున్సిపల్ చైర్మన్ నాగలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఎంపీడీవో, తహసీల్దార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.