BREAKING
అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి:పట్టభద్రులకు కాంగ్రెస్ నాయకుడు చిన్నయ్య పిలుపు తొట్టంబేడులో 77.94 శాతం పోలింగ్ అర్హులైన పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి:దోమ మండల మాజీ వైస్ ఎంపీపీ జి. మల్లేశం బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన యువకుడిపై పోలీసుల చర్యలు •ఆర్డీఓ ఎదుట హాజరు.. రూ.లక్ష జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష పడే అవకాశం ప్రభుత్వ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి:లింగన్ పల్లి సర్పంచ్ ఎర్రోళ్ల గోపాల్ పీఏసీఎస్ ద్వారా రైతులకు రూ.2.69 కోట్ల రుణాలు పంపిణీ: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి దర్శిలో ఐదు జడ్పీటీసీ స్థానాలు గెలుస్తాం గొట్టిపాటి లక్ష్మి మహిళల కొనుగోళ్లపై పరిశోధన.. సంతోష్ కుమార్‌కు డాక్టరేట్ జీవవైవిధ్య సదస్సులో సబ్సిడీ సంస్కరణలపై పురోగతి, ఫార్మా దిగ్గజాల అభ్యంతరాలు తల్లిదండ్రుల్లేని ఆడబిడ్డకు తల్లిలా అండ.. పెళ్లికి పుస్తె మెట్టెల బహూకరణ పెద్దపంజాణి మండలంలో ప్రశాంతంగా పోలింగ్- 79.39 శాతం ఓటింగ్ నమోదు పశ్చిమ హైదరాబాద్ ఆకాశహర్మ్యాల సాక్షిగా ఒత్తిడికి చిత్తవుతున్న నవతరం హృదయ వేదనకు అక్షర రూపమిది.. 1 తెలంగాణలో పచ్చిగుడ్ల మయోనైజ్‌పై ఏడాది పాటు పూర్తిస్థాయి నిషేధం బ్రెంబో వార్షిక అంచనాలను నిలబెట్టుకున్న ప్రముఖ ఆటో విడిభాగాల సంస్థ క్రిప్టో లాభాలపై 10 శాతం పన్ను...గ్రీస్ పార్లమెంట్ సంచలన చట్టం

పశ్చిమ హైదరాబాద్ ఆకాశహర్మ్యాల సాక్షిగా ఒత్తిడికి చిత్తవుతున్న నవతరం హృదయ వేదనకు అక్షర రూపమిది.. 1

Select Suryaa Now
పశ్చిమ హైదరాబాద్ ఆకాశహర్మ్యాల సాక్షిగా ఒత్తిడికి చిత్తవుతున్న నవతరం హృదయ వేదనకు అక్షర రూపమిది.. 1

(పశ్చిమ హైదరాబాద్ ఆకాశహర్మ్యాల సాక్షిగా ఒత్తిడికి చిత్తవుతున్న నవతరం హృదయ వేదనకు అక్షర రూపమిది ..!)

రాత్రి పన్నెండున్నర గంటల సమయం. గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, కోకాపేట, నార్సింగి ప్రాంతాల్లోని ఆకాశహర్మ్యాలు విద్యుద్దీపాలతో వెలిగిపోతున్నాయి. అర్ధరాత్రి దాటినా అనేక అపార్ట్‌మెంట్లలో ల్యాప్‌టాప్‌లు ఇంకా తెరిచే ఉన్నాయి. రేపటి ప్రాజెక్టు సమీక్ష కోసం కొందరు, విదేశీ క్లయింట్ల కాల్స్ కోసం మరికొందరు, తుమ్మితే ఊడే ముక్కులా ఉన్న ఉద్యోగాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఇంకొందరు ముంచుకొస్తున్న నిద్రను వాయిదా వేస్తున్నారు. బయటి ప్రపంచానికి ఇవన్నీ ఆర్థికంగా స్థిరపడిన కుటుంబాలు. మంచి ఉద్యోగాలు, భారీ జీతాలు, ఖరీదైన కార్లు, విలాసవంతమైన అపార్ట్‌మెంట్లు... కానీ ఆ వెలుగుజిలుగుల వెనుక ఉన్న ఆందోళన, అనిశ్చితి, అభద్రతాభావం బయటి ప్రపంచానికి కనిపించవు.

ఇంటి కల – ఈఎంఐల వల

ఐటీ ఉద్యోగాల్లో స్థిరపడిన యువతకు సొంత ఇల్లు సమకూర్చుకోవడం జీవిత లక్ష్యాల్లో ఒకటి. ఐటీ కారిడార్‌లో అపార్ట్‌మెంట్ కొనుగోలు చేయడం వారి విజయానికి కొలమానంగా మారింది. గృహరుణం, కారు, పిల్లల చదువులు, మెరుగైన జీవన ప్రమాణాలు.. ఇవన్నీ ప్రస్తుత ఆదాయం కొనసాగింపు లేదా వృద్ధిపై ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా, గృహరుణాల ఈఎంఐలు మధ్యతరగతి కుటుంబాలకు పెను భారంగా మారుతున్నాయి.

ప్రముఖ స్థిరాస్తి సంస్థ మేజిక్ బ్రిక్స్ తాను రూపొందించిన నమూనా ఆధారంగా 2024 ఆగస్టులో ప్రచురించిన అధ్యయనం.. హైదరాబాద్‌లో గృహరుణాలకు సంబంధించిన ఈఎంఐ నెలవారీ కుటుంబ ఆదాయంలో 61 శాతం ఉన్నట్టుగా అంచనా వేసింది. ఈ గణాంకం ప్రతి కుటుంబానికి వర్తించకపోయినా, సొంత ఇంటి కలను సాకారం చేసుకోవడానికి ఉద్యోగులు ఎంతటి ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోందో తెలియజేస్తోంది. నెలసరి రాబడిలో ఇంత పెద్ద మొత్తం ఇంటి రుణం చెల్లించడానికే వెచ్చించాల్సి రావడంతో మధ్య, దిగువ మధ్యతరగతి ఆదాయవర్గాల వారికి ఉద్యోగంలో వచ్చే చిన్నపాటి అంతరాయం కూడా పెద్ద సమస్యగా మారుతోంది.

ఉద్యోగ భద్రతకు భరోసా ఏది?

ఐటీ రంగంలో వ్యయ నియంత్రణ, ప్రాజెక్టులు-కంపెనీల పునర్వ్యవస్థీకరణ,  ఉద్యోగుల పనితీరు సమీక్షలు వంటి పరిణామాలు ఉద్యోగ భద్రతపై ఆందోళన పెంచుతున్నాయి. 2026 ఆగస్టు 31న పేపాల్ సంస్థ భారతదేశంలోని తన కార్యాలయాల్లో సుమారు 220 మంది ఉద్యోగులను తగ్గించినట్లు వెల్లడించింది. భారతదేశంలోని సంస్థ ఉద్యోగుల్లో సుమారు నాలుగు శాతం మందిపై ఈ నిర్ణయం ప్రభావం చూపింది. ఈ పరిణామం ఉద్యోగ భద్రతపై అనుభవజ్ఞులైన ఉద్యోగుల్లోనూ నెలకొన్న సంధిగ్ధతకు అద్దం పడుతోంది. పులి మీద పుట్రలా రోజు రోజుకూ విస్తరిస్తున్న కృత్రిమ మేధ ఉద్యోగ లభ్యత, భద్రతను మరింత ఆందోళనకరం చేస్తోంది.

మరుగున పడుతున్న మనోవ్యథలు

2025 సెప్టెంబరులో మనీకంట్రోల్ పత్రిక ప్రచురించిన ఒక ఉద్యోగి అనుభవం ఈ పరిస్థితికి మానవీయ కోణాన్ని జోడిస్తోంది. TCSలో 13 ఏళ్లు పనిచేసిన 35 ఏళ్ల ఉద్యోగి, నెలల తరబడి ప్రాజెక్టు కేటాయింపు లేకపోవడం, యాజమాన్యంతో వివాదాలు, ఉద్యోగం కోల్పోవడం వంటి పరిణామాలను ఎదుర్కొన్నాడు. ఉద్యోగం పోయిన విషయం తన భార్యకు, పిల్లలకు కూడా చెప్పలేని మానసిక క్షోభను అనుభవించానని, నాలుగు నెలల తర్వాత కూడా కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నానని ఆ ఉద్యోగి వెల్లడించాడు.

ఇది ఒక వ్యక్తి అనుభవమే అయినప్పటికీ, ఉద్యోగం కోల్పోవడం వల్ల కలిగే మానసిక సంఘర్షణను తేటతెల్లం చేస్తుంది.  అలాంటి సమయంలో కుటుంబ సభ్యులకు సైతం పరిస్థితిని వివరించలేని అశక్తత, సమాజంలో తమ స్థాయిని కోల్పోతామేమోననే ఆత్మన్యూనతా భావం, తిరిగి ఉద్యోగం దొరుకుతుందో లేదోననే ఆందోళన వారిని మరింత కుంగదీస్తాయి. తనను ఉన్నత చదువులు చదివించిన తల్లిదండ్రులకు ఏం చెప్పాలి? కుటుంబానికి ఎలా ధైర్యం చెప్పాలి? బ్యాంకు ఈఎంఐలు ఎలా చెల్లించాలి? అనే ప్రశ్నలు  వెంటాడుతాయి. ఉద్యోగం కోల్పోయిన విషయాన్ని కుటుంబానికి చెప్పకుండా, రోజూ ఇంటి నుంచి బయలుదేరి కేఫ్‌లలో కూర్చుని ఉద్యోగ దరఖాస్తులు పూర్తి చేసే పరిస్థితులు కూడా కొన్ని సందర్భాల్లో కనిపిస్తున్నాయి.

మానవ సంబంధాలపై ప్రభావం

ఈ మానసిక ఒత్తిడికి పరిశోధనల్లోనూ ఆధారాలున్నాయి. అనల్స్ ఆఫ్ న్యూరోసైన్సెస్ పత్రికలో 2025లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో హైదరాబాద్ విశ్వవిద్యాలయం, ICFAIకి చెందిన పరిశోధకులు 312 మంది భారతీయ ఐటీ ఉద్యోగుల నుంచి సమాచారాన్ని సేకరించి విశ్లేషించారు. ఉద్యోగ సామర్థ్యం, ఉద్యోగ సంతృప్తి, ఒత్తిడి, మానసిక శ్రేయస్సు మధ్య సంబంధాలను అధ్యయనం చేశారు. పని సంబంధిత ఒత్తిడి ఈ అంశాల మధ్య సంబంధాలను ప్రభావితం చేస్తుందని వారి విశ్లేషణ వెల్లడించింది. ఉద్యోగంలో కొనసాగాల్సిన గత్యంతరం, నిరంతరం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన ఒత్తిడి, కుటుంబానికి సమయం కేటాయించలేకపోవడం వంటి అంశాలు వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. పిల్లల జన్మదిన వార్షికోత్సవానికి వెళ్లాల్సిన తండ్రి క్లయింట్ సమావేశానికి హాజరుకావాల్సి రావడం, భార్యాభర్తలు కలిసి ఉన్నప్పడు కూడా కార్యాలయ విధులకు సంబంధించిన ఫోన్లు మాట్లాడాల్సి రావడం, నైట్ డ్యూటీలు వంటివి ఉద్యోగం, ఆదాయం దాటి మానవ సంబంధాలను, ఆరోగ్యాన్ని దీర్ఘకాలికంగా ప్రభావితం చేసే సమస్యలు.

జీతం కన్నా జీవితం మిన్న

ఈ పరిస్థితుల్లో కుటుంబాలు తమ ఆర్థిక ప్రణాళికను పునఃపరిశీలించుకోవాలి. ప్రస్తుత జీతం ఆధారంగా మాత్రమే దీర్ఘకాలిక రుణాలు తీసుకోవడం కాకుండా, ఆదాయంలో అంతరాయం ఏర్పడితే కుటుంబం ఎంతకాలం నిలదొక్కుకోగలదో కూడా అంచనా వేసుకోవాలి. అత్యవసర నిధి, తగినంత బీమా, రుణభారం నియంత్రణ, ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు అవసరం. వ్యయం విషయంలో అవసరాలు, ఆడంబరాల మధ్య వ్యత్యాసాన్ని బేరీజు వేసుకోవాలి. అలాగే, ఉద్యోగంలో ఏదైనా అవాంతరం ఏర్పడితే ఆ విషయాన్ని ఆత్మీయులతో పంచుకుంటే మనసుకు కొంత ఉపశమనం కలగటమే కాకుండా, ప్రత్యామ్నాయ ఉద్యోగాన్వేషణ సులభం కావచ్చు కూడా. ఏటికి ఎవరూ ఎదురీదలేరనే వాస్తవాన్ని అందరూ గుర్తెరిగి మసలుకోవాలి. 

సంస్థలకూ బాధ్యత ఉంది. ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణ అనివార్యమైనప్పుడు పారదర్శకత, ముందస్తు సమాచారం, పునఃశిక్షణ, గౌరవప్రదమైన ఉద్యోగ విరమణ అవకాశాలు కల్పించాలి. సాంకేతిక మార్పుల ప్రయోజనాలను పొందే సంస్థలు, ఆ మార్పుల వల్ల ప్రభావితమయ్యే ఉద్యోగుల పట్ల బాధ్యత కూడా వహించాలి.

గృహరుణాలు మంజూరు చేసే సంస్థలూ తమ అంచనాల్లో వాస్తవిక దృక్పథాన్ని అనుసరించాలి. లెహ్మాన్ బ్రదర్స్ పతనంతో ప్రపంచాన్ని కుదిపేసిన 2008 అమెరికా సబ్‌ప్రైమ్ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని, రుణగ్రహీతల చెల్లింపు సామర్థ్యాన్ని మరింత వాస్తవికంగా, ఆచరణాత్మకంగా మదింపు చేయాలి. ప్రస్తుత ఆదాయం ఇరవయ్యేళ్ల పాటు నిరంతరాయంగా కొనసాగుతుందనే భరోసాతోనే రుణ అర్హతను నిర్ణయించకుండా, ఆదాయంలో కొంత తగ్గుదల ఏర్పడినా ఈఎంఐ చెల్లించగల సామర్థ్యాన్ని అంచనా వేయాలి. అయితే ఈ మదింపు రిస్క్ మేనేజ్‌మెంట్ దృక్పథంతోనే జరగాలి గానీ, అర్హులైన వారికి రుణం నిరాకరించే సాధనంగా మారకుండా, దేశ ప్రగతికి ఆధారమైన రుణాల వృద్ధికి అవరోధం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

అదే సమయంలో, ఒక పరిశ్రమలో విస్తృతమైన ఉద్యోగ కోతల వంటి అసాధారణ పరిస్థితుల వల్ల రుణగ్రహీతల ఆదాయం తాత్కాలికంగా దెబ్బతిన్నప్పుడు, అర్హులైన వారికి  కొంత వ్యవధి పాటు ఈఎంఐ చెల్లింపులపై వెసులుబాటు కల్పించాలి. తాత్కాలిక ఉపాధి సంక్షోభం కారణంగా ఖాతా వెంటనే నిరర్థక ఆస్తిగా మారి, రుణచరిత్ర దెబ్బతినకుండా తగిన ఉపశమన మార్గాలను పరిశీలించాలి. ఈ విషయంలో బ్యాంకులు, ఆర్‌బీఐ మధ్య తగిన సమన్వయం అవసరం.

ముఖ్యంగా మన సమాజం ఒక విషయాన్ని గుర్తించాలి. ఒక వ్యక్తి విలువ అతని జీతంతోనో, ఉద్యోగ హోదాతోనో నిర్ణయించబడదు. ఉద్యోగం కోల్పోయినంత మాత్రాన అతని సామర్థ్యం, కుటుంబానికి అతను అందించే విలువ తగ్గిపోవు. ఇలాంటి సమయంలో బాధితులను చిన్నచూపు చూడకుండా, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టేలా కుటుంబ సభ్యులు, స్నేహితులు, సమాజం అండగా నిలవాలి.

భవనాలు వెలిగిపోతున్నాయంటే వాటిలో నివసించేవారి జీవితాలన్నీ వెలుగులతో నిండిపోయాయని కాదు.

కృష్ణ బాలాజీ పల్లపోతు

(డిప్యూటీ జనరల్ మేనేజర్ (రిటైర్డ్), SBI

ఫోన్: 99490 98406).