సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. ఎస్బీఐ కీలక అడ్వైజరీ జారీ!
సూర్య నేషనల్ డెస్క్: దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ రంగంలో మరోసారి ఆందోళనల వాతావరణం నెలకొంది. బ్యాంకు ఉద్యోగులు మరియు అధికారుల ప్రధాన సంఘాల వేదిక అయిన యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు సమ్మె జరగనున్నట్లు స్పష్టమైంది. ఐదు రోజుల పనిదినాల డిమాండ్‌తో పాటు పెండింగ్‌లో ఉన్న పలు సర్వీసు సమస్యల పరిష్కారం కోరుతూ ఈ సమ్మెకు దిగుతున్నట్లు యూనియన్ నాయకులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారుల కోసం అత్యవసర అడ్వైజరీని జారీ చేసింది.
ఈ సమ్మె తేదీలు సెప్టెంబర్ 26 మరియు 27 వారాంతపు సెలవు దినాలైన శనివారం, ఆదివారాలకు ఆనుకుని రావడం గమనార్హం. దీనివల్ల వారాంతపు సెలవులతో కలిపి వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకు శాఖల సాధారణ లావాదేవీలకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో శాఖల సేవలు పూర్తిగా స్థంభించే ముప్పు ఉండటంతో, ఖాతాదారులు ముందుగానే అప్రమత్తమై తమ అత్యవసర పనులను పూర్తి చేసుకోవాలని సూచించారు. భౌతిక పత్రాలు, చెక్కుల క్లియరెన్స్ మరియు ఇతర బ్రాంచ్ ఆధారిత సేవలు నిలిచిపోయే ప్రమాదం ఉంది.
సమ్మె కాలంలో వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచుతామని ఎస్బీఐ స్పష్టం చేసింది. ఖాతాదారులు నగదు అవసరాల కోసం ఏటీఎంలు అలాగే ఆటోమేటెడ్ డిపాజిట్ అండ్ విత్‌డ్రాయల్ మెషిన్‌లను ఉపయోగించుకోవాలని కోరింది. అలాగే డిజిటల్ లావాదేవీల కోసం ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్ మరియు యూపీఐ సేవలను యథావిధిగా వినియోగించుకోవచ్చని వెల్లడించింది. బ్రాంచ్‌లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్ ద్వారానే వేగంగా చెల్లింపులు జరుపుకోవచ్చని స్పష్టం చేసింది.
బ్యాంకు యూనియన్ల డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం మరియు యాజమాన్యాలు చర్చలు జరుపుతున్నప్పటికీ, స్పష్టమైన హామీ రాకపోవడంతో సమ్మె అనివార్యమైనట్లు సమాచారం. ఈ సమ్మె కారణంగా వ్యాపార వర్గాలు, సాధారణ ఖాతాదారులు ఇబ్బంది పడకుండా ముందుస్తుగానే తమ బ్యాంకు పనులను ప్లాన్ చేసుకోవడం మంచిదని హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఒకవేళ సమస్యలు పరిష్కారం కాకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని యూనియన్లు హెచ్చరిస్తున్న నేపథ్యంలో, ఈ ఐదు రోజుల బ్యాంకింగ్ సేవల బంద్ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.