బీరంగూడ గుట్టపై ఆధ్యాత్మిక వైభవం.. అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం..
అమీన్ పూర్ ; భక్తి పారవశ్యం.. ఆధ్యాత్మిక పరిమళం.. అయ్యప్ప నామస్మరణతో బీరంగూడ గుట్ట పులకించిపోయింది. స్వామియే శరణమయ్యప్ప అంటూ వేలాది మంది అయ్యప్ప స్వాముల శరణుఘోషతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. భక్తజనుల కోలాహలం, వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ బీరంగూడ గుట్టపై ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరిసింది.పటాన్ చెరు నియోజకవర్గం బీరంగూడ డివిజన్ పరిధిలోని బీరంగూడ గుట్టపై నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో పంచలోహ విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. తోగుట పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామివారి ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆగమ శాస్త్రోక్తంగా ప్రతిష్ఠాపన కార్యక్రమాలు కొనసాగాయి.ఈ మహోన్నత కార్యక్రమానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అయ్యప్ప స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
అయ్యప్ప స్వామి భక్తి, క్రమశిక్షణ, నిష్ఠ, సమానత్వం, సేవాభావానికి ప్రతీక అని అన్నారు. అయ్యప్ప దీక్ష చేపట్టిన ప్రతి స్వామి 41 రోజుల పాటు నియమ నిష్ఠలతో, భక్తిశ్రద్ధలతో ఆచరించే దీక్ష ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. స్వామియే శరణమయ్యప్ప అనే నినాదం మనలో భక్తిభావంతో పాటు సోదరభావం, ఐక్యతను పెంపొందిస్తుందని తెలిపారు.బీరంగూడ గుట్టపై ఇంతటి పవిత్రమైన అయ్యప్ప స్వామి ఆలయం నిర్మించి, విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులోనూ ఆలయ అభివృద్ధికి తన వంతు సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే జిఎంఆర్ 10 లక్షల రూపాయల విరాళం అందించిన విషయం అందరికీ తెలిసిందే.ఈ పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములైన ఆలయ కమిటీ సభ్యులు, దాతలు, అయ్యప్ప స్వాములు, భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప మాలధారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.