కండక్టర్‌గా సీఎం విజయ్: తమిళనాడులో మహిళలకు 'వెట్రి పయనం' ఉచిత బస్సు పథకం విస్తరణ, ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
సూర్య జాతీయ డెస్క్: గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ మహిళల కోసం ఉద్దేశించిన ఉచిత బస్సు ప్రయాణ పథకం 'వెట్రి పయనం' విస్తరణను చెన్నైలో ప్రారంభించారు. ఇప్పటివరకు సాధారణ నగర బస్సులకే పరిమితమైన ఈ సౌకర్యం ఇకపై ఎక్స్‌ప్రెస్, ఎల్‌ఎస్‌ఎస్, డీలక్స్ సర్వీసులకూ వర్తిస్తుంది. ప్రారంభోత్సవం కోసం కోయంబేడు బస్ టెర్మినస్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి, ఓ బస్సులో కండక్టర్‌లా మహిళా ప్రయాణికులకు టికెట్లు అందించి వారితో ముచ్చటించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
బస్సులో ప్రయాణికులతో సీఎం మాట్లాడుతున్న సమయంలో కొందరు కళాశాల విద్యార్థినులు ఆయనకు చాక్లెట్లు అందించగా, ఆయన వాటిని సరదాగా తన జేబులో పెట్టుకున్నారు. ఊహించని ఈ ఆత్మీయతకు విద్యార్థినులు సంబరపడ్డారు. సాధారణంగా ఉన్నత పదవుల్లో ఉన్నవారు ప్రజల మధ్యకు వచ్చినప్పుడు కనిపించే దూరం ఇక్కడ కనిపించలేదని, సీఎం ప్రయాణికులతో కలసిపోయారని అక్కడి వారు చెబుతున్నారు.
ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ విస్తరణతో రాష్ట్రవ్యాప్తంగా 12,692 ప్రభుత్వ బస్సుల్లో మహిళలు, ట్రాన్స్‌జెండర్లు పూర్తిగా ఉచితంగా ప్రయాణించవచ్చు. మహానగర, పట్టణ ప్రాంతాల్లో ఎక్స్‌ప్రెస్, ఎల్‌ఎస్‌ఎస్, డీలక్స్ బస్సులతో పాటు జిల్లాల మధ్య తిరిగే సాధారణ సబర్బన్ బస్సులు, కొండ ప్రాంతాల్లో 40 కిలోమీటర్లకు మించిన సాధారణ బస్సులు కూడా ఈ పథకం పరిధిలోకి వస్తాయి. లబ్ధిదారులకు ఆదాయ పరిమితి లేదు, రోజువారీ ప్రయాణాల సంఖ్యపైనా పరిమితి లేదు. దీనివల్ల రోజుకు సుమారు 84 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరనుందని అధికారులు తెలిపారు. ఉపఎన్నికలు జరగనున్న మదురాంతకం, ధారాపురం ప్రాంతాల్లో మాత్రం ప్రస్తుతం ఈ పథకం అమలు కాదు.
పాలక పార్టీ తమిళగ వెట్రి కళగం పేరు నుంచి ఈ పథకానికి 'వెట్రి పయనం' అనే పేరు పెట్టారు. గత డీఎంకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'విడియల్ పయనం' పథకాన్నే కొత్త పేరుతో కొనసాగిస్తున్నారని డీఎంకే నేత టీకేఎస్ ఇళంగోవన్ విమర్శించారు. అయితే గత నెలలో అసెంబ్లీలో రూల్ 110 కింద సీఎం చేసిన ప్రకటన మేరకు పథకాన్ని కొత్త రకాల బస్సులకు విస్తరించడం వల్ల మహిళలకు అదనపు ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: తిరుమల శ్రీవారికి నిత్యం 45 రకాల నైవేద్యాలు: మిర్చి లేకుండా మిరియాలతోనే వైఖానస ఆగమ ప్రసాదాల రహస్యం