తిరుమల శ్రీవారికి నిత్యం 45 రకాల నైవేద్యాలు: మిర్చి లేకుండా మిరియాలతోనే వైఖానస ఆగమ ప్రసాదాల రహస్యం
సూర్య ఆధ్యాత్మిక డెస్క్: ప్రపంచ ప్రసిద్ధ తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ప్రతిరోజూ 45 రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. భక్తులకు లడ్డూ ప్రసాదంగా సుపరిచితమైన స్వామివారికి, వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం శాస్త్రోక్తంగా వివిధ రకాల అన్నప్రసాదాలు, పిండి వంటలను నివేదిస్తారు. ఈ 45 ప్రసాదాల్లో 20 అన్నప్రసాద నైవేద్యాలు కాగా, మిగిలిన 25 పణ్యారములు. ఆలయ పోటులో ఈ పదార్థాలను అత్యంత పవిత్రంగా, సంప్రదాయ పద్ధతులకు అనుగుణంగా సిద్ధం చేస్తారు. తయారీలో వాడే పదార్థాలు, పాత్రలు, విధానాలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది.
ఈ ప్రసాదాల్లో ఎండుమిర్చి, పచ్చిమిర్చి వాడకపోవడం విశేషం. కారం కోసం నల్లమిరియాలనే ఉపయోగించడం ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఆనవాయితీ. వైఖానస పరిభాషలో వీటికి ప్రత్యేక పేర్లు ఉన్నాయి. భక్తులు పులిహోరగా పిలిచే ప్రసాదాన్ని తింత్రిణీరసాన్నం అని, నెయ్యి పొంగలిని ముద్గాన్నం అని, బెల్లం అన్నాన్ని గుడాన్నం అని, మిరియాల అన్నాన్ని మరీచ్యాన్నం అని పిలుస్తారు. అలాగే వడను మాషాపూపం, దోశను చక్రప్పం అంటారు. పాలతో చేసే తీపి అన్నాన్ని క్షీరాన్నం, కూరగాయల అన్నాన్ని కదంబం అని వ్యవహరిస్తారు.
నైవేద్య సమయాలు కూడా నిర్దిష్టంగా ఉంటాయి. మొదటి గంట తర్వాత సమర్పించే ఉదయ నైవేద్యంలో ముద్గాన్నం, తింత్రిణీరసాన్నం, దధ్యోదనం, గుడాన్నం, శాకాన్నం, శర్కరాన్నం వంటి అన్నప్రసాదాలు ఉంటాయి. వీటితో పాటు లడుకం, మాషాప్పం, గుడప్పం, చక్రప్పం అనే నాలుగు రకాల పణ్యారములను రోజూ నివేదిస్తారు. రెండో గంట తర్వాత మధ్యాహ్నం రాజభోగంలో శుద్ధాన్నం, పులిహోర, గుడాన్నం, దధ్యోదనం, శీరా వంటివి సమర్పిస్తారు. మూడో గంట తర్వాత రాత్రి శయనభోగంలో మరీచ్యాన్నం, చక్రప్పం, లడుకం, మాషాప్పం, శర్కరాన్నం తదితరాలు ఉంటాయి. ధనుర్మాసం వంటి ప్రత్యేక సందర్భాల్లో బెల్లం దోశ, సుండల్, అదనపు ముద్గాన్నం, శీరా వంటి వాటితో నైవేద్య జాబితా మరింత విస్తరిస్తుంది.
సాయంకాల ఆరాధనలో గర్భాలయాన్ని మరోసారి శుభ్రపరిచి, శ్రీవారిని తాజా పుష్పాలతో అలంకరిస్తారు. అనంతరం అర్ధరాత్రి సమయంలో తెల్ల అన్నం, బెల్లంతో చేసిన తీపి గుడాన్నంతో కూడిన తిరువీసం అనే ప్రత్యేక నైవేద్యాన్ని సమర్పిస్తారు. రోజులో చివరి ఏకాంత సేవలో వెచ్చని పాలు, కాలానుగుణంగా లభించే పండ్ల ముక్కలు, నెయ్యిలో వేయించిన ఎండు ఫలాలను స్వామికి నివేదిస్తారు. ప్రతి నైవేద్యానికి ప్రత్యేకమైన పేరు, తయారీ విధానం, సమర్పించే సమయం ఉండటం తిరుమల ఆలయ ప్రాచీన వైదిక సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబిస్తోంది. భక్తులు ప్రసాదంగా స్వీకరించే పులిహోర, పొంగలి, వడ, అప్పం వెనుక ఇంతటి ఆగమ నియమాలు ఉన్నాయని ఈ వివరాలు తెలియజేస్తున్నాయి.