హిందూ మహాసముద్రం దేశాలను కలపాలి కానీ విడదీయకూడదు
సూర్య జాతీయ డెస్క్: హిందూ మహాసముద్ర తీర దేశాల మధ్య చారిత్రక, నాగరికత సంబంధాలు ఉన్నాయని, సముద్రాలు దేశాలను విడదీసేవిగా కాకుండా కలిపేవిగా నిలవాలని భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బుధవారం ఉద్ఘాటించారు. మాల్దీవుల రాజధాని మాలేలో జరుగుతున్న కొలంబో సెక్యూరిటీ కాన్‌క్లేవ్ ఎనిమిదో జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. సముద్ర భద్రత, ప్రాంతీయ స్థిరత్వం, ఆర్థిక శ్రేయస్సు కోసం ఈ ప్రాంత దేశాల మధ్య నిరంతర సహకారం అవసరమని పిలుపునిచ్చారు. పూర్వీకులు సముద్రాలు మనల్ని కలిపే సంప్రదాయ వారసత్వాన్ని అందించారని, భవిష్యత్ తరాలకు కూడా సముద్రాల ద్వారా ఐక్యతను నిలిపే వారసత్వాన్ని అందించాలని ఆయన కోరారు.
హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రత, స్థిరత్వం కోసం 2020 నవంబర్‌లో కొలంబో సెక్యూరిటీ కాన్‌క్లేవ్ ఏర్పడిందని, ఇప్పటివరకు గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ ఇంకా ఎంతో దూరం ప్రయాణించాల్సి ఉందని దోవల్ అన్నారు. భారతదేశపు నైబర్‌హుడ్ ఫస్ట్ విధానం, మహాసాగర్ దార్శనికతల కలయికగా సీఎస్‌సీ నిలుస్తోందని స్పష్టం చేశారు. మారుతున్న తీవ్రమైన భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు సభ్య దేశాల సామర్థ్యాలను పెంపొందించేందుకు భారత్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. హిందూ మహాసముద్రం జాతీయ భద్రత, ఆర్థిక పురోగతికే కాకుండా ఈ ప్రాంత ప్రజల శ్రేయస్సు, ప్రయోజనాల పరిరక్షణకు కూడా కీలకమని పేర్కొన్నారు.
సీఎస్‌సీ చార్టర్, సెక్రటేరియట్ ఏర్పాటుకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై 2024 ఆగస్టు 30న కొలంబోలో సభ్య దేశాలు సంతకాలు చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ, సంస్థాగత బలోపేతానికి జరిగిన కృషిని దోవల్ ప్రశంసించారు. సెక్రటేరియట్ నాయకత్వంలో ఉన్న అడ్మిరల్ ఘోర్మాడే సేవలను కొనియాడారు. సముద్ర భద్రత, ఉగ్రవాద నిరోధం, అక్రమ రవాణా మరియు అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాల అణచివేత, సైబర్ భద్రత మరియు కీలక మౌలిక సదుపాయాల రక్షణ, మానవతా సహాయం మరియు విపత్తు సహాయం అనే ఐదు ప్రధాన స్తంభాల ఆధారంగా సీఎస్‌సీ పనిచేస్తోంది. నవంబర్ 24న సమావేశానికి ముందు దోవల్ మాల్దీవుల రక్షణ, జాతీయ సేవల మంత్రి హసన్ రషీద్‌తో భేటీ అయ్యి ద్వైపాక్షిక రక్షణ, భద్రతా సహకారంపై చర్చించారు. నవంబర్ 24 నుంచి 26 వరకు జరిగే ఈ సమావేశంలో భారత్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మారిషస్, శ్రీలంక, సీషెల్స్ దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు.