telangana
స్తంభాలపై తీగల జాతర.. ప్రమాదాలకు ఆహ్వానం
సూర్య, లక్షెట్టిపేట: పట్టణంలోని పలు వీధుల్లో విద్యుత్ స్తంభాలపై తీగలు, కేబుళ్లు అస్తవ్యస్తంగా దర్శనమిస్తున్నాయి. ఒకే స్తంభానికి పెద్ద సంఖ్యలో కేబుళ్లు చుట్టి ఉండటంతో పాటు, నిరుపయోగంగా మారిన వైర్లు కూడా తొలగించకుండా వదిలేశారు. కొన్ని చోట్ల వైర్ల చుట్టలు స్తంభాలకే వేలాడుతుండగా, మరికొన్ని చోట్ల భవనాలకు ఆనుకుని కేబుళ్లు గజిబిజిగా కనిపిస్తున్నాయి. రహదారుల వెంట, నివాస ప్రాంతాల్లో నెలకొన్న ఈ పరిస్థితి ఎప్పుడు ఎలాంటి ప్రమాదానికి దారితీస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత శాఖల అధికారులు స్పందించి అనవసర కేబుళ్లను తొలగించి, మిగిలిన వైర్లను క్రమబద్ధీకరించాలని పట్టణవాసులు కోరుతున్నారు.