ప్యాకేజ్డ్ తాగునీటి నాణ్యతపై దేశవ్యాప్త తనిఖీలు ప్రారంభించిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ
సూర్య జాతీయ డెస్క్: దేశవ్యాప్తంగా ప్యాకేజ్డ్ తాగునీటి నాణ్యతను పరిశీలించేందుకు భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల సంస్థ దేశవ్యాప్త పర్యవేక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిందని సంస్థ సీఈఓ రజిత్ పున్హానీ వెల్లడించారు. వివిధ ఆహార వర్గాల ప్రమాణాల పాటింపును తనిఖీ చేసే నిరంతర ప్రక్రియలో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టామని, ఫలితాలు రావడానికి కనీసం ఒకటి నుంచి రెండు నెలల సమయం పడుతుందని ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ప్యాకేజ్డ్ తాగునీటిని ఎంపిక చేయడానికి ప్రత్యేక కారణం అంటూ ఏదీ లేదని, గత ఏడాది పాడి ఉత్పత్తులు, మాంసం, గుడ్లు, తృణధాన్యాలు, ఎనర్జీ డ్రింక్స్, చక్కెర పానీయాల తరహాలోనే నీటి నాణ్యత తనిఖీ కూడా విస్తృత పర్యవేక్షణలో భాగమేనని స్పష్టం చేశారు.
బిస్లెరీ ఇంటర్నేషనల్ గోవా యూనిట్ నుంచి సేకరించిన ప్యాకేజ్డ్ తాగునీటి నమూనాకు సంబంధించిన నియంత్రణ చర్యల నేపథ్యంలో ఈ దేశవ్యాప్త తనిఖీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం 2006 ప్రకారం బ్రోమేట్ పరిమితులకు విరుద్ధంగా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించి సురక్షితం కాదని ప్రకటించిన నేపథ్యంలో, సదరు సంస్థపై ప్రాసిక్యూషన్ ప్రారంభించేందుకు నవంబర్ 23న ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అనుమతి మంజూరు చేసింది. వ్యాపార సంస్థ అప్పీల్ మేరకు నమూనాను రిఫరల్ ఆహార ప్రయోగశాలకు పంపగా, పాలీన్యూక్లియర్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ ఉన్నట్లు గుర్తించి దానిని కూడా సురక్షితం కాదని నిర్ధారించింది. అయితే నవంబర్ 23న ఇచ్చిన వివరణలో దక్షిణ గోవాలోని వెర్నా ఎలక్ట్రానిక్ సిటీ ప్లాంట్ నుంచి సేకరించిన జీఓ 270 బ్యాచ్‌కు చెందిన ఒకే ఒక్క నమూనాకు మాత్రమే ఈ చర్య పరిమితమని సంస్థ పేర్కొంది. ఆ నిర్దిష్ట బ్యాచ్ విక్రయాలను నిషేధిస్తూ చట్టంలోని సెక్షన్ 36 సబ్ సెక్షన్ 3 కింద ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ వివరణను బిస్లెరీ ఇంటర్నేషనల్ స్వాగతిస్తూ, విక్రయ నిషేధం కేవలం 2025 సెప్టెంబర్ 27న గోవా ప్లాంట్‌లో తయారైన ఆ ఒక్క బ్యాచ్‌కు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. తాము ఏటా యాభై వేలకు పైగా బ్యాచ్‌లను ఉత్పత్తి చేస్తామని, సంబంధిత బ్యాచ్ స్టాక్ ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో లేదని స్పష్టం చేసింది. పునఃపరీక్షలో బ్రోమేట్ స్థాయిలు అనుమతించిన పరిమితి కంటే తక్కువగా ఉన్నట్లు తేలిందని సంస్థ పేర్కొంది.
మరోవైపు తప్పుదోవ పట్టించే ప్రకటనలు, వాదనల విషయంలో ఆహార వ్యాపార సంస్థలు నైతిక ప్రకటనల పద్ధతులను పాటించాల్సిన అవసరాన్ని రజిత్ పున్హానీ నొక్కి చెప్పారు. ఈ అంశాన్ని కేవలం చట్టపరమైన కోణంలోనే కాకుండా నైతిక కోణంలోనూ పరిశీలిస్తున్నామని, బాధ్యతాయుతమైన ప్రకటనలపై పరిశ్రమ దృష్టి సారించాలని కోరారు. వివిధ ఆహార ఉత్పత్తుల నాణ్యత, భద్రతను పర్యవేక్షించే విస్తృత చర్యలలో భాగంగానే దేశవ్యాప్త నీటి నాణ్యత తనిఖీలు జరుగుతున్నాయని వివరించారు.