దక్షిణ అస్సాంలోని డోలూలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి రూ. 2,014 కోట్లు
సూర్య జాతీయ డెస్క్: అస్సాంలోని సిల్చార్ సమీపంలోని డోలూలో కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ అభివృద్ధికి రూ. 2,014 కోట్ల అంచనా వ్యయంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ బుధవారం ఆమోదం తెలిపింది. ప్రస్తుత సిల్చార్ విమానాశ్రయంలో ఉన్న కార్యాచరణ, స్థల పరిమితులను అధిగమించి, పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా విమానాశ్రయ సంస్థ ద్వారా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ప్రస్తుతం ఉన్న విమానాశ్రయం రక్షణ భూమిలో సివిల్ ఎన్క్లేవ్‌గా పనిచేస్తుండటంతో మౌలిక సదుపాయాల విస్తరణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ అస్సాంతో పాటు పొరుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో విమాన ప్రయాణ అవసరాలను తీర్చడానికి ఈ కొత్త విమానాశ్రయం దోహదపడుతుంది.
కచార్ జిల్లాలోని డోలూ ప్రాంతం బరాక్ లోయలో వ్యూహాత్మక స్థానంలో ఉంది. విస్తారమైన తేయాకు తోటలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, పర్యావరణ మరియు సాంస్కృతిక పర్యాటక రంగాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. ప్రతిపాదిత విమానాశ్రయంలో 12,351 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్ భవనం నిర్మించనుండగా, రద్దీ వేళల్లో గంటకు 800 మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యం ఉంటుంది. ఆధునిక ప్రయాణికుల సౌకర్యాలు, పర్యావరణ హిత భవన ప్రమాణాలు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విస్తరించుకునే వీలుతో దీన్ని తీర్చిదిద్దనున్నారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా ఏ-320 రకం విమానాలు నడిచేందుకు అనువైన కోడ్ 4సీ ప్రమాణాలతో 2,705 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పు గల రన్‌వేను నిర్మిస్తారు. ఆరు ఏ-320 విమానాలను నిలిపేందుకు వీలుగా కొత్త ఏప్రాన్‌తో పాటు ప్రత్యేక ఐసోలేషన్ బేను కూడా అభివృద్ధి చేయనున్నారు.
డోలూ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే దక్షిణ అస్సాం, పరిసర ప్రాంతాలలో విమాన అనుసంధానత మెరుగుపడటంతో పాటు ప్రస్తుత సిల్చార్ విమానాశ్రయంపై రద్దీ తగ్గుతుంది. వ్యాపార, పర్యాటక రంగాలకు ఊతం లభించి, మార్కెట్లకు చేరువయ్యే అవకాశాలు పెరగడం ద్వారా బరాక్ లోయ ఆర్థిక సామర్థ్యం వెలుగులోకి వస్తుందని అధికారులు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ వృద్ధి కారిడార్లతో ఈ ప్రాంతానికి మెరుగైన అనుసంధానం ఏర్పడి, ఈశాన్య భారత విమానయాన మౌలిక సదుపాయాలలో ఇది కీలక ముందడుగుగా నిలుస్తుందని వివరించారు.