మహిళా సాధికారతే వికసిత భారత్‌కు బాట: డిసెంబర్ 23 వరకు విస్తృత కార్యక్రమాలు
గుంటూరు : మహిళలపై హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాలో ‘నయీ చేతనా 5.0’ జాతీయ లింగ ప్రచారం బుధవారం ప్రారంభమైంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ ప్రచారం డిసెంబర్ 23 వరకు జిల్లా వ్యాప్తంగా కొనసాగనున్నాయి. జీవనోపాధులు, సమాన అవకాశాల ద్వారా వికసిత భారత్ కోసం మహిళా సాధికారత” అనే ఇతివృత్తంతో ఈ ఏడాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళల్లో అవగాహన పెంచడంతో పాటు, వారు ఆర్థికంగా స్వావలంబులై కుటుంబం, సమాజంలో నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదగడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ ఏడాది ప్రచారంలో ప్రధానంగా నాలుగు అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మహిళలకు అవకాశాలు అందకుండా చేసే అడ్డంకులను గుర్తించడం.ఆస్తుల కల్పన: భూమి, గృహ హక్కులు, పశువులు, పరికరాలపై మహిళల యాజమాన్యం, ప్రాప్యతను ప్రోత్సహించడం. మహిళలు, బాలికలు స్వేచ్ఛగా, భద్రంగా ప్రయాణించే పరిస్థితులు కల్పించడం. గృహ, సంరక్షణ పనుల భారాన్ని కుటుంబ సభ్యులు సమానంగా పంచుకునేలా ప్రోత్సహించడం జరుగుతుందన్నారు.
సూర్య నాయక్