ఢిల్లీలో ప్రతిపక్షాల భారీ మార్చ్ నేపథ్యంలో దేశ రాజధానిలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు
సూర్య జాతీయ డెస్క్: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి తీరును నిరసిస్తూ, దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి తలపెట్టిన భారీ నిరసన ప్రదర్శన నేపథ్యంలో ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. ఓటర్ల జాబితా సవరణ వివాదం మరియు ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయంటూ ప్రతిపక్షాలు చేపట్టిన చలోఢిల్లీ మార్చ్‌కు భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలివస్తుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. చారిత్రక రామ్‌లీలా మైదాన్ వేదికగా జరగనున్న ఈ మహాసభకు అనుమతి ఇచ్చినప్పటికీ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించి, పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు.
రామ్‌లీలా మైదాన్ పరిసర ప్రాంతాలతో పాటు కీలక మార్గాల్లో వేలాది మంది పోలీసులు, అర్ధసెనిక బలగాలను రంగంలోకి దించారు. రక్షణ ఏర్పాట్లలో భాగంగా సుమారు పద్నాలుగు ప్రత్యేక జోన్లుగా విభజించి బందోబస్తు నిర్వహిస్తున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. జనసమ్మర్ధాన్ని నియంత్రించడానికి, అనుమానాస్పద కదలికలను పసిగట్టడానికి సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లు మరియు బాడీ-ఓర్న్ కెమెరాలతో నిఘా పెంచారు. వేదిక వద్దకు చేరుకునే మార్గాల్లో డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
ఈ భారీ నిరసన ప్రదర్శన కారణంగా నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీసులు ముందుగానే వాహనదారులకు సూచించారు. మరోవైపు పండుగ సీజన్ కావడంతో రామ్‌లీలా మైదాన్ సమీపంలో జరిగే ఈ మార్చ్ వల్ల తమ వ్యాపారాలు దెబ్బతింటాయని స్థానిక వర్తక సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే ప్రతిపక్ష నేతలు మాత్రం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే ఈ పోరాటమని స్పష్టం చేస్తూ, దేశవ్యాప్తంగా ఉన్న తమ మద్దతుదారులు శాయుత నిరసనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వ ప్రతిస్పందన ఎలా ఉంటుందనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.