నేరాల నివారణే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా పోలీసుల ముమ్మర రాత్రి గస్తీ
మచిలీపట్నం, మేజర్ న్యూస్: కృష్ణాజిల్లాలో నేరాల నివారణే లక్ష్యంగా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు పోలీసులు రాత్రివేళ ముమ్మర గస్తీ నిర్వహిస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో నైట్ రౌండ్స్ చేపడుతూ బీట్ పాయింట్లను నిరంతరం తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రార్థనా మందిరాలు, ఏటీఎంలు, ప్రధాన వ్యాపార సముదాయాల వద్ద నిఘా పెంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. డయల్ 100, హైవే మొబైల్ వాహనాల ద్వారా నిరంతర పెట్రోలింగ్ నిర్వహిస్తూ, రాత్రివేళ డ్రైవర్లు నిద్రమత్తుతో ప్రమాదాలకు గురికాకుండా ‘వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వాహనాలను నిలిపి డ్రైవర్లతో ముఖం కడిగించి, రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రధాన కూడళ్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల భద్రత కోసం పోలీసులు చేపడుతున్న తనిఖీలకు ప్రజలు, వాహనదారులు పూర్తిస్థాయిలో సహకరించాలని జిల్లా పోలీస్ యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం నియోజకవర్గం, కృష్ణాజిల్లా.