కళ్యాణదుర్గం మున్సిపాలిటీ లో కొనసాగుతున్న ఎన్నికల పక్రియ.
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పట్టణంలోని 32 వార్డుల పరిధిలో ఎన్నికల నిర్వహణకు 62 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 36,622 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 17,597 మంది పురుషులు, 19,023 మంది మహిళలు, ఇద్దరు ఇతర ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్య 1,426 అధికంగా ఉండటం విశేషం. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా సమస్యాత్మకంగా గుర్తించిన పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆయా కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పోలింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు చేపట్టారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బలగాలను మోహరించి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల విధుల నిర్వహణ కోసం సిబ్బందిని నియమించడంతో పాటు పోలింగ్ సామగ్రిని సంబంధిత కేంద్రాలకు చేరవేశారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా ఎన్నికల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. ఓటర్లకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఓటర్లందరూ ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు, భయభ్రాంతులకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటింగ్‌లో పాల్గొని ప్రజాస్వామ్య పండుగను విజయవంతం చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. 32 వార్డుల్లో ఓటర్లు ఏ అభ్యర్థులకు పట్టం కడతారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.